ఒక్క మాట చెప్పి ఉంటే పెళ్లే ఆపేసేవాళ్లం.. సియా గోయల్‌ సోదరుడు

Siya Goyal brother says would have cancelled wedding if she told us
  • సియా సోదరుడు సాహిల్‌ను 10 గంటలు విచారించిన పోలీసులు
  • సియా-చేతన్‌ సంబంధంపై పోలీసుల ఆరా
  • ముందూ హత్యాయత్నాలు జరిగాయన్న ఆరోపణలను ఖండించిన సియా తల్లి
  • తనయుడి బట్టతల సమస్యను ఖండించిన కేతన్‌ తండ్రి విశాల్‌
  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు విచారణకు ప్రభుత్వం నిర్ణయం
పూణే రియల్టర్‌ కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌ సోదరుడు సాహిల్‌ గోయల్‌ను పోలీసులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

సియా గోయల్‌కు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేకపోయి ఉంటే ఒక్క మాట చెప్పినా వివాహం రద్దు చేసేవాళ్లమని సాహిల్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం విచారణకు హాజరైన అతణ్ని రాత్రి వరకు ప్రశ్నించిన తర్వాతే పోలీసులు పంపించారు.

విచారణలో సియా, సహ నిందితుడు చేతన్‌ చౌదరితో ఉన్న సంబంధం, ఇద్దరి మధ్య పరిచయం, హత్యకు ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. జూన్‌ 18న లోహగడ్‌ కోట వద్ద సియా, ఆమె ప్రియుడు చేతన్‌ కలిసి కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేశారు. నవంబర్‌లో జరగాల్సిన పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరూ ముందే కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు ఘటనకు ముందు కూడా సియా పలుమార్లు కేతన్‌ను లోహగడ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని దర్యాప్తులో తేలింది. అయితే సియా తల్లి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఘటన జరిగిన రోజు లోహగడ్‌కు వెళ్లేందుకు సియాకు ఆసక్తి లేదని, కేతన్‌, అతడి తల్లే వీడియో కాల్‌లో ఒప్పించారని చెప్పారు.

మరోవైపు కేతన్‌ బట్టతల సియాకు నచ్చలేదని.. అందుకే హత్య చేసిందనే వాదనా తెరపైకి వచ్చింది. దీనిపై కేతన్‌ తండ్రి విశాల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. తన కుమారుడి జుట్టు సమస్య గురించి ముందే సియా కుటుంబానికి చెప్పామని తెలిపారు. ఆ కారణంగా పెళ్లి వద్దనుకోవాలనిపించి ఉంటే నేరుగా తిరస్కరించాల్సిందని అన్నారు.

ఈ కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికంను నియమించింది.
Siya Goyal
Ketan Agarwal murder case
Pune realtor murder
Chetan Chaudhary
Lohagad Fort
Ujjwal Nikam

More Telugu News