మూడు రోజుల సీషెల్స్ పర్యటనకు బయల్దేరిన మోదీ
- నేటి నుంచి 29 వరకు సీషెల్స్ లో పర్యటించనున్న మోదీ
- సీషెల్స్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
- విజయ్ మహాసాగర్ లో సీషెల్స్ ఒక ప్రధాన భాగస్వామి అన్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనకు గాను సీషెల్స్ దేశానికి బయల్దేరారు. సీషెల్స్ నేషనల్ డే ‘గోల్డెన్ జూబ్లీ’ వేడుకలకు మోదీ ‘గెస్ట్ ఆఫ్ ఆనర్’ గా హాజరవుతున్నారు. సీషెల్స్ కు బయల్దేరే ముందు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... "నా మిత్రుడు, సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు నేను జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో పర్యటిస్తున్నాను" అని తెలిపారు.
"సీషెల్స్ అనేది కేవలం ఒక ద్వీప దేశం మాత్రమే కాదు. భారత రక్షణ రంగానికి అదొక కీలక సముద్ర దేశం. హిందూ మహాసముద్రంలో భద్రత, శాంతిని పెంపొందించడానికి భారత్ తెచ్చిన ‘విజన్ మహాసాగర్’ వ్యూహంలో సీషెల్స్ ఒక ప్రధాన భాగస్వామి" అని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు హెర్మినీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
మరోవైపు, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని (పార్లమెంట్‌ను) ఉద్దేశించి ప్రసంగించబోతున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఈ పర్యటన సందర్భంగా అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజలను కూడా ప్రధాని కలవనున్నారు.