షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్‌కు మరోసారి తలవంపులు
- షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదుల కలకలం
- హాజరైన 2025 పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి
- పాక్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని మరోసారి రుజువు
షోయబ్ అక్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ ఈ నెల 24న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి 2025 పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి హాజరయ్యాడు. ఇతనితో పాటు లష్కరే రాజకీయ విభాగమైన పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. వీరు బహిరంగంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడం పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్‌లో జరిగిన 26/11 ముంబై దాడులతో పాటు ఎన్నో విధ్వంసాలకు కారణమైన లష్కరే తోయిబా సంస్థను అంతర్జాతీయ సమాజం నిషేధించింది. ఈ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన హఫీజ్ సయీద్, పీఎంఎంఎల్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ 2024 పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. కసూరి లాంటి భయంకరమైన ఉగ్రవాదులు బహిరంగంగా తిరగడం, పాకిస్థాన్ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు పాక్ వ్యవస్థలో ఎంతటి పలుకుబడి ఉందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ఎవరీ సైఫుల్లా కసూరి?
భారత్‌కు సైఫుల్లా కసూరి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకడు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ఇతడే ప్రధాన సూత్రధారి అని భారత నిఘా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించిన భారత్, పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రతీకార చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మురిద్కేలో ఉన్న లష్కరే ప్రధాన కార్యాలయంతో పాటు రావల్పిండి నుంచి సుక్కూర్ వరకు ఉన్న కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.
భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌తో లష్కరే తీవ్రంగా దెబ్బతింది. అయినా కూడా కసూరి తన బుద్ధి మార్చుకోలేదు. భారత్‌పై విషం కక్కుతూనే ఉన్నాడు. మరోసారి 26/11 తరహాలో సముద్ర మార్గం గుండా దాడి చేస్తామని ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. ఇంతటి ప్రమాదకరమైన ఉగ్రవాది పాకిస్థాన్ రాజధానిలో స్వేచ్ఛగా తిరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.