వెనెజువెలాకు భారత్‌ భారీ సాయం.. ‘ఆపరేషన్‌ అమిస్తాద్‌’ ప్రారంభం

India provides massive aid to Venezuela as Operation Amistad begins
  • ఐఏఎఫ్‌కు చెందిన రెండు సీ-17 విమానాల్లో వైద్య సామగ్రి
  • భీష్మ క్యూబ్‌లు, మందులు, 35 టన్నుల సహాయ సామగ్రి
  • బయలుదేరిన 41 మంది వైద్య బృందం
  • 235కు చేరిన మృతుల సంఖ్య 
  • వేలాది మంది గల్లంతు
  • వెనెజువెలాకు అండగా ఉంటామని భారత్‌ హామీ
వరుస భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన వెనెజువెలాకు భారత్‌ అండగా నిలిచింది. బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు ‘ఆపరేషన్‌ అమిస్తాద్‌’ (స్పానిష్‌లో అమిస్తాద్‌ అంటే స్నేహం) పేరుతో ప్రత్యేక సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు భారత వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాల్లో వైద్య బృందం, భీష్మ క్యూబ్‌లు, మందులు, ఇతర సహాయ సామగ్రిని పంపింది.

ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వెల్లడించారు. వెనెజువెలా ప్రజలకు ఈ క్లిష్ట సమయంలో భారత్‌ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక బృందంలో 60 పారా ఫీల్డ్‌ హాస్పిటల్‌కు చెందిన 41 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది వైద్యులు ఉన్నారు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సేవలు అందించేందుకు వీరు సిద్ధంగా ఉన్నారు. విదేశాంగ శాఖ అందించిన సుమారు ఆరు టన్నుల వైద్య సామగ్రి కూడా వెంట తీసుకెళ్లారు.

అలాగే ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు కింద రూపొందించిన రెండు భీష్మ క్యూబ్‌లను కూడా పంపించారు. ఇవి విపత్తుల సమయంలో తాత్కాలిక ఆసుపత్రులుగా ఉపయోగపడే ఆధునిక వైద్య యూనిట్లు. 

వెనెజువెలాలో బుధవారం నిమిషం వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటివరకు 235 మంది మృతి చెందారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. వేలాది మంది ఇంకా గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. రాజధాని కరాకస్‌, లా గువైరా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రెజిల్‌, మెక్సికో, అర్జెంటీనా తదితర దేశాలు కూడా సాయాన్ని ప్రకటించాయి.
India
Operation Amistad
Venezuela Earthquake Relief
S Jaishankar
BHISHM Cubes
Medical Aid

More Telugu News