షాకింగ్ వీడియో: రెండేళ్లు కూడా నిండని పిల్లాడు అలా ప్రవర్తిస్తున్నాడేంటి?
- మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లోని డే కేర్ సెంటర్‌లో ఘటన
- మరో చిన్నారి దారుణంగా గాయపర్చిన బాలుడు
- సిబ్బంది బయటకు వెళ్లినప్పుడు దారుణ ప్రవర్తన
- 15 నిమిషాల్లో 25 సార్లు గట్టిగా కొరికిన వైనం
- డే కేర్ సెంటర్ నిర్లక్ష్యం వెలుగులోకి
- తప్పు కప్పిపుచ్చుకునేందుకు తల్లిదండ్రులకు లంచం ఇచ్చే యత్నం
జూన్ 22న సీఐడీసీవో ప్రాంతంలోని ఫస్ట్‌క్రై ఇంటెల్లిటాట్స్ ప్రీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఓ మహిళా న్యాయవాది ఉదయం 10.30 గంటలకు తన 23 నెలల కుమారుడిని డే కేర్‌లో వదిలి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత సంరక్షకురాలు ఒక చిన్నారిని తీసుకుని బయటకు వెళ్లి, మిగిలిన ముగ్గురు చిన్నారులను గదిలోనే ఉంచింది.
గదిలో ఎవరూ లేకపోవడంతో పిల్లలు భయంతో ఏడవడం ప్రారంభించారు. ఈ సమయంలో ఓ బాలుడు మరో చిన్నారిపై దాడి చేసి పదేపదే కొరకడం, ఎక్కడపడితే అక్కడ కొట్టడం, దొరికిందల్లా విసిరేయడం మొదలుపెట్టాడు. దాదాపు 15 నిమిషాల వ్యవధిలో 25 సార్లు కొరకాడు. మరో చిన్నారి భయంతో చూస్తూ నిలబడ్డాడు. బాధతో చిన్నారి ఏడుస్తున్నా చాలా సేపటి వరకు ఎవరూ గదిలోకి వెళ్లి చూడలేదు.
ఈ ఘటనలో బాలుడి ముఖం, ముక్కు, పెదవులు, ఛాతీ, వీపు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టిన డే కేర్ యాజమాన్యం ‘చిన్న గీతలే పడ్డాయి’ అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. బాలుడి దుస్తులు విప్పి చూడగానే ఒళ్లంతా గాట్లు కనిపించడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో డే కేర్ సీఈవో శుభమ్ మహేశ్వరి, మేనేజర్లు మంగేశ్ ముసాలే, వైభవ్ సావడే, ప్రిన్సిపాల్ కాంచన్ యేవాలే, మహిళా సంరక్షకురాలు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు కేసు పెట్టొద్దని చెప్పి రూ.10 లక్షలు, మూడేళ్ల పాటు ఉచిత విద్య ఇస్తామని యాజమాన్యం ఆఫర్ చేసినట్లు బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై విద్యాశాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది. డే కేర్‌కు అవసరమైన అనుమతులు కూడా లేవన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వయసులో ఆ పిల్లాడికి అంత హింసాత్మక ప్రవర్తన ఏంటని ప్రశ్నిస్తున్నారు. బహుశా మానసిక సమస్యతో బాధపడుతూ ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌కు చూపించడం మేలని సూచిస్తున్నారు.