మాగ్నా కార్టా కన్నా ముందే మన అర్థశాస్త్రం.. ప్రపంచానికి సమానత్వాన్ని నేర్పింది భారత్: సీజేఐ సూర్యకాంత్
- మాగ్నా కార్టా కన్నా ముందే అర్థశాస్త్రంలో సమానత్వ భావన ఉందన్న సూర్యకాంత్
- నాలుగో శతాబ్దంలోనే కౌటిల్యుడు ఈ సూత్రాన్ని ప్రతిపాదించారని సీజేఐ వెల్లడి
- చట్టం అందుబాటులో ఉండటం అంటే హక్కులు దక్కడమేనని వ్యాఖ్య
- ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ న్యాయ వేదికలో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగం
1215లో వచ్చిన మాగ్నా కార్టా.. రాజుతో సహా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలనే విప్లవాత్మక సూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందని చెబుతారని, కానీ అంతకంటే ముందే నాలుగో శతాబ్దంలోనే కౌటిల్యుడి అర్థశాస్త్రం సమానత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందని తాను వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సంస్కృతంలో రచించిన అర్థశాస్త్రాన్ని మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ప్రధాన సలహాదారుడైన కౌటిల్యుడు రచించారు.
ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. చట్టం సమానంగా అందుబాటులో ఉండటం అనేది కేవలం ఒక ప్రక్రియగా మిగిలిపోకూడదని, అది ప్రజలకు వాస్తవ హక్కులను అందించాలని స్పష్టం చేశారు. "చట్టపరమైన హామీలను వల్లెవేయడం కాదు.. భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంతరాలను అధిగమించి వాటి ఫలాలను ప్రజలకు అందించడమే అసలైన సవాల్" అని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కూడా పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం, గౌరవంగా జీవించే హక్కు వంటి అనేక ప్రాథమిక హక్కులను అందించిందని గుర్తుచేశారు. వలసవాదం, పేదరికం వంటి సమస్యల నుంచి బయటపడి అనేక దేశాలు ఇంకా తమ వ్యవస్థలను నిర్మించుకుంటున్నాయని ఆయన అన్నారు.