ఐస్‌లాండ్‌లో మన మామిడి ఘుమఘుమలు.. తొలిసారిగా ప్రమోషన్ ఈవెంట్స్

Indian Mangoes in Iceland First Ever Promotion Events Held
  • ఐస్‌లాండ్‌లో తొలిసారిగా భారత మామిడి పండ్ల ప్రమోషన్
  • మామిడి ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు
  • దశేరి, కేసర్ వంటి రకాలను ప్రదర్శించిన భారత రాయబార కార్యాలయం
  • భారత మామిడి రుచులకు ఐస్‌లాండ్‌ వాసులు, వ్యాపారుల ప్రశంసలు
భారతదేశానికి చెందిన మేలురకం మామిడి పండ్ల ఎగుమతులను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐస్‌లాండ్‌లో మొట్టమొదటిసారిగా 'మ్యాంగో ప్రమోషన్ ఈవెంట్స్' నిర్వహించింది. రెండు దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐస్‌లాండ్‌ రాజధాని రేక్‌జావిక్‌లోని భారత రాయబార కార్యాలయం, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) సంయుక్తంగా రేక్‌జావిక్‌, అకురెరి నగరాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ సందర్భంగా దశేరి, చౌసా, లంగ్రా, కేసర్ వంటి నాలుగు ప్రసిద్ధ భారతీయ మామిడి రకాలను ప్రదర్శించగా.. వాటి రుచి, సువాసనకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాల్లో ఐస్‌లాండ్‌ విదేశాంగ శాఖ అధికారులు, వ్యాపారవేత్తలు, దిగుమతిదారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐస్‌లాండ్‌లోని భారత రాయబారి ఆర్. రవీంద్ర మాట్లాడుతూ, భారత మామిడి పండ్ల ప్రత్యేకతను వివరిస్తూ, ఐస్‌లాండ్‌ మార్కెట్‌కు ఎగుమతులు పెంచడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారత్-యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం (టీఈపీఏ) ద్వారా భారత మామిడి దిగుమతులకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయని ఐస్‌లాండ్‌ విదేశాంగ శాఖ అధికారి స్విన్ కె. ఐనార్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక మామిడి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్, నాణ్యతా ప్రమాణాలు, మెరుగైన మార్కెట్ యాక్సెస్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహిస్తోందని భారత రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ అనీషా తోమర్ తెలిపారు. 2025లో ఐస్‌లాండ్‌ సుమారు 3.3 మిలియన్ డాల‌ర్ల (రూ. 31.20కోట్లు) విలువైన మామిడి పండ్లను దిగుమతి చేసుకోగా, అందులో దాదాపు 1 మిలియన్ డాల‌ర్ల (రూ. 9.45కోట్లు) వాటా థాయ్‌లాండ్‌దే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్‌ మార్కెట్‌లో వాటాను పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Indian Mangoes
Iceland Mango Promotion
APEDA India
Mango Exports Iceland
Indian Embassy Reykjavik
India Iceland Trade

More Telugu News