భారత్‌కు గుడ్‌న్యూస్‌: మరింత కిందకు చమురు ధరలు.. వారంలో 7 శాతం పతనం

Good news for India Crude oil prices fall further with 7 percent drop in a week
  • రెండు శాతం తగ్గిన ముడి చమురు ధరలు
  • హర్మూజ్‌లో మెరుగుపడిన నౌకా రవాణా పరిస్థితులు
  • ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధర జూన్‌లో 86.31 డాలర్లు
  • 120 డాలర్ల నుంచి 74 డాలర్లకు చేరిన బ్రెంట్‌
  • చమురు ధరల తగ్గుదలతో భారత్‌కు ఊరట
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. హర్మూజ్‌ జలసంధిలో చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గడంతో బ్రెంట్‌, డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధరలు దాదాపు రెండు శాతం మేర పడిపోయాయి. ఈ వారం మొత్తంగా రెండు బెంచ్‌మార్క్‌లు సుమారు ఏడు శాతం నష్టాలను నమోదు చేసే దిశగా సాగుతున్నాయి.

ప్రారంభ ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రెండు శాతం తగ్గి 73.75 డాలర్లకు, అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (WTI) ధర రెండు శాతం పడిపోయి 70.42 డాలర్లకు చేరింది. ఒమన్‌ సమీపంలో ఓ సరకు నౌకపై దాడి జరగడంతో గురువారం చమురు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. తిరిగి కిందకు దిగి వస్తున్నాయి.

అయితే కాల్పుల విరమణ తర్వాత హర్మూజ్‌ జలసంధి మీదుగా ట్యాంకర్ల రాకపోకలు మళ్లీ పెరగడంతో సరఫరా అంతరాయాలపై భయాలు తగ్గాయి. దీంతో చమురు ధరలు మళ్లీ దిగొచ్చాయి. భారత్‌ దిగుమతి చేసుకునే బ్రెంట్‌, ఒమన్‌, దుబాయ్‌ గ్రేడ్‌ల సగటుతో లెక్కించే ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధర జూన్‌లో ఇప్పటివరకు బ్యారెల్‌కు 86.31 డాలర్ల వద్ద నమోదైంది. మేలో ఇది 106.23 డాలర్లు, ఏప్రిల్‌లో 114.48 డాలర్లుగా ఉంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల తీవ్ర స్థాయికి చేరిన సమయంలో బ్యారెల్‌ ధర దాదాపు 120 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండడం విశేషం.
Crude Oil
Brent Crude Price
WTI Crude Oil
Global Oil Market
India Oil Imports
Strait of Hormuz

More Telugu News