నాన్నమ్మకు టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. ఇదిగో వీడియో!
- నాలుగేళ్ల తర్వాత సొంతూరు గాజువాకలో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి
- నానమ్మకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్న క్రికెటర్
- కోహ్లీనే తనకు ఆదర్శమని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చానని వెల్లడి
- గాయం నుంచి కోలుకుని జింబాబ్వే సిరీస్‌తో తిరిగి జట్టులోకి వస్తానని ధీమా
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత సొంతూరికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నా బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది. ఈ ప్రాంతంతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది" అని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రుల త్యాగాలే కారణమని నితీశ్ రెడ్డి తెలిపాడు.
"చిన్నప్పటి నుంచి నా కలలను నమ్మి, నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి కష్టం వల్లే నాకు భారత జట్టులో చోటు దక్కింది. నేను దేశానికి ఆడాలని మా నానమ్మ ఎప్పుడూ కలలు కనేది" అని కుటుంబ సభ్యుల ప్రోత్సాహాన్ని వివరించాడు.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. కోహ్లీ ఆటతీరు, అంకితభావం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పాడు. భారత జట్టులో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, జట్టులో స్థానం సుస్థిరం చేసుకొని దేశానికి మరిన్ని విజయాలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం నితీశ్ రెడ్డి తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు గాయపడ్డాడు. "గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 4-5 వారాల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత జరిగే జింబాబ్వే సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది" అని నితీశ్ వెల్లడించాడు. ఈ గాయం కారణంగానే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమవ్వగా, అతని స్థానంలో సూర్యాన్ష్ షెడ్జేను బీసీసీఐ ఎంపిక చేసింది.