నిజాయతీ చాటుకున్న క్యాషియర్.. పెళ్లింట వెలకట్టలేని సంతోషం
- తిరుపతి హోటల్‌లో రూ.45 లక్షల బంగారం మర్చిపోయిన బెంగళూరు ఫ్యామిలీ
- నిజాయతీ చాటుకుని బ్యాగ్‌ను భద్రపరిచిన హోటల్ క్యాషియర్ శశి
- పోలీసుల చొరవతో బాధితులకు సురక్షితంగా చేరిన నగల బ్యాగ్
- శశి నిజాయతీని ప్రశంసించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
- తిరుమలలో పెళ్లి చేసుకుని తిరిగెళ్తుండగా చోటుచేసుకున్న ఘటన
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన శ్రీభరత్‌కుమార్ కుటుంబం తిరుమలలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకుంది. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత బుధవారం కుటుంబ సభ్యులంతా కలిసి తిరుపతికి చేరుకున్నారు. ఇక్కడి జూపార్క్ రోడ్డులో ఉన్న గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసి, అనంతరం బెంగళూరుకు బయల్దేరారు. అయితే, తీరా ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం గుర్తించారు.
రూ.45 లక్షల బంగారంతో బ్యాగ్ మిస్సింగ్..
తాము తెచ్చుకున్న ఓ హ్యాండ్‌బ్యాగ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గమనించారు. ఆ బ్యాగులో దాదాపు రూ. 45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన నగలు కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే భరత్‌కుమార్ పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తిరుపతి హోటల్‌లో భోజనం చేసినప్పుడు బ్యాగ్ పొరపాటున మర్చిపోయి ఉంటామని తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న తిరుపతి పోలీసులు వెంటనే గరుడాద్రి హోటల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న శశిని సంప్రదించగా, ఆమె ఒక హ్యాండ్‌బ్యాగ్ తమకు దొరికిందని, దాన్ని భద్రంగా దాచి ఉంచామని తెలిపారు. వెంటనే ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బ్యాగును పరిశీలించి, భరత్‌కుమార్‌కు సమాచారం అందించి, దానిని వారికి సురక్షితంగా అందజేశారు.
నిజాయతీని సత్కరించిన ఎస్పీ
తమ బంగారం సురక్షితంగా తిరిగి దొరకడంతో భరత్‌కుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ నగలు వివాహానికి సంబంధించినవని, ఒకవేళ దొరకకపోతే తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాషియర్ శశి నిజాయతీ వల్లే తమ పెళ్లింట ఆనందం నిలిచిందని చెబుతూ, ఆమెకు, సత్వరమే స్పందించిన పోలీసులకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, క్యాషియర్ శశి నిజాయతీకి ముగ్ధులయ్యారు. ఆమెను జిల్లా పోలీస్ కార్యాలయానికి (డీపీవో) పిలిపించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. "మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి నిజాయతీ. శశి చూపిన బాధ్యత, నిబద్ధత సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం" అని ప్రశంసించారు. ఇలాంటి వ్యక్తుల వల్లే సమాజంలో నైతిక విలువలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. శశి వంటి నిజాయతీపరులను గౌరవించడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.