ఇంటెలిజెన్స్‌ బ్యూరో కొత్త చీఫ్‌గా తెలంగాణ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి!

Mahesh Dixit appointed as new Intelligence Bureau Director
  • కొత్త ఐబీ చీఫ్‌గా మహేశ్‌ దీక్షిత్‌ 
  • ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను పర్యవేక్షించిన అధికారి
  • జమ్మూ, కశ్మీర్‌, లేహ్ ప్రాంతాల్లో ఐబీ ఆపరేషన్లకు నాయకత్వం
  • ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు చొరబాట్ల నిరోధంలో కీలక పాత్ర
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలో తీవ్రవాద నెట్‌వర్క్‌లపై నిఘా  
దేశ అత్యున్నత అంతర్గత గూఢచారి సంస్థ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) కొత్త డైరెక్టర్‌గా మహేశ్‌ దీక్షిత్‌ నియమితులయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఈ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

1993 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి తెలంగాణ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన మహేశ్‌ దీక్షిత్‌ తన కెరీర్‌లో ఎక్కువ కాలం ఐబీలోనే సేవలందించారు. జాయింట్‌ డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్‌, స్పెషల్‌ డైరెక్టర్‌ హోదాల్లో పనిచేస్తూ సంస్థలో కీలక స్థానాలకు ఎదిగారు.

శ్రీనగర్‌లోని ఐబీ అనుబంధ విభాగం (ఎస్‌ఐబీ) చీఫ్‌గా పనిచేసిన సమయంలో జమ్మూ, కశ్మీర్‌, లేహ్‌ ప్రాంతాల భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దు చొరబాట్ల నిరోధం, అంతర్గత భద్రతా నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇస్లామిక్‌ తీవ్రవాద నెట్‌వర్క్‌లపై నిఘా కార్యకలాపాల్లో కూడా మహేశ్‌ దీక్షిత్‌కు విస్తృత అనుభవం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక వ్యవస్థల్లో ఆయనకు ఉన్న అనుభవం నియామకానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

2022లో అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన మహేశ్‌ దీక్షిత్‌ 2024 సెప్టెంబర్‌లో స్పెషల్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. ఐబీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తే దేశవ్యాప్తంగా కౌంటర్‌ టెర్రరిజం, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, అంతర్గత భద్రత, రాష్ట్రాల మధ్య గూఢచారి సమన్వయ వ్యవస్థలను పర్యవేక్షించే బాధ్యతలు నిర్వహించనున్నారు.
Mahesh Dixit
Intelligence Bureau Director
IPS Officer Telangana Cadre
IB Chief Appointment
Internal Security India
Counter Terrorism Expert

More Telugu News