రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్

KTR says Revanth Reddy government buried real estate sector
  • రూ.కోటి విలువ భూములు ఇప్పుడు రూ.60 లక్షలకు కూడా అమ్ముడవడం లేదని వ్యాఖ్య
  • కేసీఆర్ హయాంలో పరిశ్రమలతో భూముల విలువలు పెరిగాయని వెల్లడి
  • ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపణ
  • రైతు బంధు, దళిత బంధు అంశాల్లో ప్రజలను మోసం చేశారని విమర్శ
  • 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కార్యకర్తలకు పిలుపు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు రియల్ ఎస్టేట్‌పై గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ముందు రూ.కోటి పలికిన ఎకరం భూమి ప్రస్తుతం రూ.50-60 లక్షలకు కూడా కొనుగోలుదారులు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. రియల్ ఎస్టేట్‌పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. షాబాద్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్‌పన్ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చామని చెప్పారు. పరిశ్రమల విస్తరణతో ఒకప్పుడు రూ.30 లక్షలు ఉన్న ఎకరం భూమి విలువ రూ.3 కోట్లకు చేరిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు, దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు, అసైన్డ్ భూముల పట్టాల అంశాల్లో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని కేటీఆర్‌ ఆరోపించారు. గత ప్రభుత్వ అప్పులపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు తమ పాలనలో చేసిన అప్పుల లెక్కలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చయ్యాయని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Look at Shorts
KTR
Revanth Reddy
Telangana Real Estate Crisis
BRS Party Telangana
Chevella BRS Meeting
Telangana Land Prices

More Telugu News