చంపేస్తానంటూ జర్నలిస్టులకు ఎంపీ బెదిరింపు... స్పందించిన ఏక్‌నాథ్ షిండే
- ప్రశ్నించిన జర్నలిస్టులపై ఎంపీ సంజయ్ పాటిల్ ఆగ్రహం
- మళ్లీ కనిపిస్తే చంపేస్తానంటూ తీవ్ర పదజాలంతో బెదిరింపులు
- పాటిల్ క్షమాపణ చెప్పాలని సూచించిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే
- ఎంపీని అరెస్ట్ చేయాలంటూ ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ డిమాండ్
గురువారం కొందరు విలేకరులు సంజయ్ పాటిల్‌ను కలిశారు. ఆయన ఇటీవల ఉద్ధవ్ థాకరే వర్గాన్ని వీడి షిండే వర్గంలో చేరగా, ఆయన కుమార్తె, కార్పొరేటర్ అయిన రాజుల్ పాటిల్ మాత్రం ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగుతున్నారు. ఇదే విషయంపై జర్నలిస్టులు ప్రశ్నించడంతో సంజయ్ పాటిల్ సహనం కోల్పోయారు. "నా వ్యక్తిగత విషయాలతో మీకేం పని? మళ్లీ నా వద్దకు వస్తే చంపేస్తా" అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పాటిల్ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించినట్లు తెలిపారు. ప్రత్యర్థి వర్గం కావాలని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులుచేస్తున్నందునే పాటిల్ అలా స్పందించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ఎవరిని బెదిరించినా అది తప్పేనని, ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తానని వెల్లడించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, గతంలోనూ పాటిల్ "బాంబులు వేస్తా", "ఐదుగురిని చంపాను" వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు.