కొండ కింద డ్రోన్ సామ్రాజ్యం.. హెజ్బొల్లాకు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్!

Drone empire under hill Israel gives massive shock to Hezbollah
  • లెబనాన్‌లో హెజ్బొల్లా భూగర్భ డ్రోన్ కేంద్రం గుర్తింపు
  • ఇజ్రాయెల్ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో స్థావరం
  • కొండ కింద వందల మీటర్ల సొరంగ వ్యవస్థ
  • 50 పేలుడు డ్రోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
  • ఎనిమిది టన్నుల పేలుడు పదార్థాల గుర్తింపు
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ లెబనాన్‌లోని ఓ కొండ కింద భారీ భూగర్భ డ్రోన్ కేంద్రాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా ఈ కేంద్రాన్ని నిర్మించిందని ఆరోపించింది. ఇక్కడ డ్రోన్ల తయారీతో పాటు వాటిని ఇజ్రాయెల్‌పై ప్రయోగించే ఏర్పాట్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

లెబనాన్‌లోని మజ్దల్ జౌన్ గ్రామం సమీపంలో ఈ భూగర్భ కేంద్రం ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది దేశ సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటీవల నిర్వహించిన సైనిక చర్యల్లో ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత సొరంగ మార్గాలు బయటపడినట్లు పేర్కొంది.

సైనిక అధికారుల వివరాల ప్రకారం, ఈ సొరంగ వ్యవస్థ కొండ లోపల వందల మీటర్ల మేర విస్తరించి ఉంది. దాదాపు 29 మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రానికి భారీ ఉక్కు తలుపులతో రక్షణ కల్పించారు. గతంలో గుర్తించిన హెజ్బొల్లా సొరంగాల కంటే ఇది అత్యంత ఆధునికంగా నిర్మించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

సొరంగం లోపల డ్రోన్ల తయారీకి ఉపయోగించే పరికరాలు, విడిభాగాలు గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది. అలాగే సుమారు 50 డ్రోన్లు కూడా లభించినట్లు తెలిపింది. వాటిలో ఒక్కో డ్రోన్‌కు దాదాపు 30 కిలోల పేలుడు పదార్థం అమర్చినట్లు పేర్కొంది.

ఈ డ్రోన్లు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కేంద్రంలో సుమారు ఎనిమిది టన్నుల పేలుడు పదార్థాలు నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. ఈ తరహా డ్రోన్లను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

కొండ దక్షిణ భాగంలో ప్రత్యేక డ్రోన్ ప్రయోగ మార్గాలను కూడా గుర్తించినట్లు సైన్యం తెలిపింది. అవసరమైనప్పుడు భారీ తలుపులు తెరిచి డ్రోన్లను నేరుగా ఇజ్రాయెల్ వైపు ప్రయోగించేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు వివరించింది.
Go Back to Shorts
Hezbollah
Israel
Underground drone base
South Lebanon
IDF military operation
Iran backed drones

More Telugu News