అమెరికా బీచ్‌లో పెను విషాదం.. నిద్రపోతుండగా కొట్టుకుపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థినులు!
- శాంటాక్రూజ్ తీరంలో భారీ ప్రమాదం
- నిద్రిస్తుండగా ముంచెత్తిన సముద్రపు అలలు
- హర్షిత, మహియాల్‌లుగా బాధితుల గుర్తింపు
బుధవారం (జూన్ 10) సాయంత్రం 5 గంటల సమయంలో పాంథర్ బీచ్, ఎల్లో బ్యాంక్ బీచ్ మధ్య ఉన్న 'కీహోల్' (Keyhole) అనే సహజ రాతి గుహ ద్వారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వారు అక్కడ నిద్రిస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన అలలు వారిని సముద్రంలోకి లాగేశాయి. సమాచారం అందుకున్న వెంటనే కాల్ ఫైర్ (CAL FIRE), స్టేట్ పార్క్స్, స్థానిక అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఎనిమిది మంది రెస్క్యూ స్విమ్మర్లు రంగంలోకి దిగారు. అత్యంత శ్రమతో ఒక యువతిని హెలికాప్టర్ ద్వారా, మరొకరిని స్టోక్స్ బాస్కెట్ సాయంతో తీరానికి చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హర్షిత జూన్ 11న మరణించగా, మహియాల్ ఆదివారం కన్నుమూసింది.
హెచ్చరికలు ఉన్నా తప్పని ప్రమాదం
ఈ ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ వాతావరణ సంస్థ తీరప్రాంతమంతటా ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన ఈ వన్-మైల్ (ఒక మైలు) తీరప్రాంతం అత్యంత ప్రమాదకరమైన పెద్ద అలలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఒక్క నెలలోనే ఇక్కడ జరిగిన ఐదో సముద్ర రెస్క్యూ ఆపరేషన్ ఇది. 'కీహోల్' గుహ ద్వారా అవతలి బీచ్‌కి వెళ్లే పర్యాటకులు.. పోటు (High Tide) వచ్చినప్పుడు నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఊహించని విధంగా చిక్కుకుపోతారని ఫైర్ కెప్టెన్ కైల్ బ్రెటన్ తెలిపారు.
మహియాల్ తండ్రి ఈ ఘటనపై మాట్లాడుతూ.. "అసలు ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో అమ్మాయిల ఫోన్, బ్యాగ్ దొరికాయని, అయితే అవి తడవకపోవడాన్ని బట్టి వారు నీటి అంచున ఉన్న సమయంలోనే అలలు ఒక్కసారిగా లాగేసి ఉంటాయని భావిస్తున్నారు. హర్షిత నాయర్ యూసీ బెర్క్లీ (UC Berkeley)లో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ శ్రాన్ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ (SJSU)లో పబ్లిక్ హెల్త్ విద్యార్థిని. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువతులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో బే ఏరియాలోని భారతీయ కమ్యూనిటీతో పాటు వారి యూనివర్సిటీల్లో తీవ్ర విషాదం నెలకొంది.