నీట్‌ రీ-టెస్ట్‌.. కేంద్ర నిర్ణయాలపై అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

Annamalai slams Central decisions on NEET retest security
  • నీట్‌ రీ-టెస్ట్‌ భద్రతా ఏర్పాట్లపై అన్నామలై విమర్శలు
  • భారీ భద్రతా చర్యలు విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతాయన్న నేత
  • పరీక్ష సమయం పెంపుపైనా అభ్యంతరం
  • పారదర్శకతతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని సూచన
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ‘వుయ్ ది లీడర్స్‌’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించిన తమిళనాడు నేత అన్నామలై.. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూన్‌ 21న నిర్వహించనున్న నీట్‌ రీ-టెస్ట్‌ కోసం చేపట్టిన భారీ భద్రతా ఏర్పాట్లు విద్యార్థుల్లో విశ్వాసం పెంచడం కంటే ఒత్తిడికి గురి చేసే ప్రమాదం ఉందని విమర్శించారు.

సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఎన్నడూ లేని విధంగా భద్రతా వ్యవస్థను అమలు చేస్తోందన్నారు. సీఆర్పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌ భద్రత, భారత వైమానిక దళం ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, ఏఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ తనిఖీలు, పలుదశల తనిఖీలు వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు.

ఇలాంటి ఏర్పాట్లు అత్యంత సున్నితమైన భద్రతా ఆపరేషన్లలో కనిపిస్తాయని, విద్యార్థుల పరీక్షలకు మాత్రం అరుదుగా ఉంటాయని అన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు ఇప్పటికే ఒత్తిడిలో ఉంటారని, ఇలాంటి కఠిన తనిఖీలు వారిలో మరింత ఆందోళన పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) లక్ష్యం విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడమేనని, ప్రస్తుత చర్యలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. పరీక్షల పారదర్శకతను కాపాడుతూనే విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అన్నామలై సూచించారు.
Advertisement
Annamalai
NEET Re-test
Central Government
Student Stress
NEET Exam Security
We The Leaders

More Telugu News