మెట్రో నిధులు రూ.13,600 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
- హైదరాబాద్ మెట్రో కోసం రూ.13,600 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ డిమాండ్
- నిధుల విడుదలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు
- మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
- సహకరించకపోతే కనీసం NOC అయినా ఇవ్వాలని ప్రభుత్వ వాదన
- తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి విమర్శ
ఎల్&టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్-1ను స్వాధీనం చేసుకున్న తర్వాత, అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు జపాన్ ఏజెన్సీ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ద్వారా తక్కువ వడ్డీకి రుణం పొందినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్ ఏజెన్సీ ఇప్పటికే నిధులను IRFCకి బదిలీ చేసిందని, కానీ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆ మొత్తాన్ని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఈ వ్యవహారం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకోవాలని కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, అశ్విని వైష్ణవ్‌లను కలిసి కోరారని విమర్శించారు. "ఈ రోజు తెలంగాణకు రావాల్సిన రూ.13,600 కోట్లను విడుదల చేసే బాధ్యతను కిషన్ రెడ్డి తీసుకుంటారా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఎల్&టీ సంస్థ ఫేజ్-1లో ఏటా రూ.400 కోట్ల నష్టాలను చవిచూస్తోందని, దీంతో వారు ఫేజ్-2 నిర్మాణానికి అంగీకరించలేదని రేవంత్ గుర్తుచేశారు. కేంద్రం సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను టేకోవర్ చేసిందని, ఇప్పుడు నిధులు రాకుండా అడ్డుకోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.