హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం.. అలర్ట్ జారీ

Hyderabad twin reservoirs flood inflow increases alert issued
  • భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తాజా ఇన్‌ఫ్లో
  • ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీరు జలాశయాల్లోకి వస్తున్నట్టు వెల్లడి
  • మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన జలమండలి అధికారులు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్ జలమండలి (HMWSSB) అధికారులు ఎప్పటికప్పుడు నీటి మట్టాలను, ఇన్‌ఫ్లోను నిశితంగా గమనిస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. జలాశయాల్లోకి సుమారు 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,784.30 అడుగుల వద్ద నీరు ఉంది. అదేవిధంగా, హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.60 అడుగుల వద్ద కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్, హైడ్రా (HYDRAA) విభాగాలను అప్రమత్తం చేశారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ రుతుపవనాల సీజన్‌లో జలాశయాలకు ఇదే మొదటి చెప్పుకోదగ్గ వరద ప్రవాహం. ప్రస్తుతానికి గేట్లు తెరిచేంత ప్రమాదం లేదని, ఒకవేళ పరిస్థితిని బట్టి గేట్లు ఎత్తివేయాల్సి వస్తే ఆ సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Hyderabad Twin Reservoirs
Osman Sagar
Himayat Sagar
Hyderabad Rains
Musi River Alert
HMWSSB

More Telugu News