కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు హాజరుకానున్న ప్రకాశ్ రాజ్
- బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
- ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించిన ప్రకాశ్ రాజ్
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ డిమాండ్
- నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలపై వెల్లువెత్తిన ఆందోళనలు
- ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాలంటూ ప్రకాశ్ రాజ్ పిలుపు
ఈ నిరసనలో పాల్గొనడంపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకు, ఈ శాంతియుత నిరసనకు మద్దతుగా బెంగళూరు వస్తున్నాను. దయచేసి అందరూ ఇందులో పాల్గొని ప్రభుత్వాన్ని జవాబుదారీ చేద్దాం" అని #JustAsking అనే హ్యాష్‌ట్యాగ్‌తో పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శించే ప్రకాశ్ రాజ్, ఈ నిరసనకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ సమస్యలు, పరీక్షల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు వంటి అంశాలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే యువత నేతృత్వంలోని ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్, పుణె, లక్నో, హైదరాబాద్‌లలో నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లో జరిగిన నిరసనకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. రాజ్యాంగం, జాతీయ జెండాలను చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతూ, విద్యావ్యవస్థలోని లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.