జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు
- గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం
- జూన్ నెలాఖరులోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు
- నీటి సంరక్షణ పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని పిలుపు
శనివారం జలవనరుల శాఖ, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. జలహారతి పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఉపాధి హామీ (MGNREGS) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
నీటి మిగులు ఉన్న బేసిన్లను, నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే ప్రాజెక్టులను చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, పంట కుంటల పునరుద్ధరణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వాల్మీకిపురం వాగు అభివృద్ధి వంటి విజయవంతమైన నమూనాలను ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని సూచించారు.
మొదటి దశలో పునరుద్ధరించిన ఆస్తుల నాణ్యతను పరిశీలించాలని, వరద నివారణకు కాలువల్లోని అడ్డంకులను తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల రీఛార్జ్, పర్యావరణ ప్రయోజనాలపై జిల్లా వారీగా అంచనాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ నీటి సంరక్షణ యజ్ఞంలో ప్రజలు, రైతులు, నీటి వినియోగదారుల సంఘాలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.