ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!

Thinles Singhe builds business with Himalayan Sea Buckthorn containing 12 times more Vitamin C than oranges
  • లడక్‌కు చెందిన ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో ‘జింపో’ బ్రాండ్ ఏర్పాటు
  • థిన్లే సింఘే అనే ఎంబీఏ యువకుడి వినూత్న వ్యాపార ప్రస్థానం
  • ఈ ‘మిరాకిల్ బెర్రీ’లో పోషక విలువలు చాలా అధికం
  • స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ ఏటా రూ.10 లక్షల ఆర్జన
లడఖ్‌కు చెందిన ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్, హిమాలయాల్లో అడవి పండుగా పెరిగే ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పోషక విలువలు మెండుగా ఉన్న ఈ ఫలానికి తన ‘జింపో’ బ్రాండ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాడు. స్థానికంగా లభించే ఈ సూపర్‌ఫుడ్‌ను ఒక విజయవంతమైన వ్యాపారంగా మలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

లడఖ్‌కు చెందిన థిన్లే సింఘే‌కు 2016లో ఎంబీఏ విరామ సమయంలో ఒక కేరళ వైద్యుడితో సాగించిన సంభాషణే ఈ వ్యాపార ఆలోచనకు బీజం వేసింది. హిమాలయ మూలికలపై జరిగిన ఆ చర్చ, ‘సీ బక్‌థార్న్’లోని పోషక విలువలపై అతడి దృష్టి మళ్లేలా చేసింది. ఈ పండును ‘మిరాకిల్ బెర్రీ’గా పిలుస్తారు. ఇందులో ఒమేగా 3, 6, 9తో పాటు అరుదైన ఒమేగా 7 కూడా ఉంటుంది. నారింజ పండ్లతో పోలిస్తే 12 రెట్లు అధికంగా విటమిన్-సి ఉండటమే కాకుండా, విటమిన్-ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. లడఖ్ సీ బక్‌థార్న్‌కు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించింది.

సుమారు మూడేళ్ల సుదీర్ఘ ప్రణాళిక అనంతరం, లడఖీ భాషలో ‘రుచికరమైన’ అని అర్థం వచ్చేలా ‘జింపో’ పేరుతో సింఘే తన బ్రాండ్‌ను ప్రారంభించాడు. స్థానిక గ్రామస్థుల నుంచి నేరుగా బెర్రీలను సేకరిస్తూ, వాటితో రెడీ-టు-డ్రింక్ జ్యూస్‌లు, పల్ప్, జామ్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. ఈ వ్యాపారం ద్వారా అతడు ఏటా సుమారు రూ. 10 లక్షలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనితో పాటు, ‘జీరో వేస్ట్ లడక్’ సంస్థతో కలిసి 'బాటిల్ బై-బ్యాక్' కార్యక్రమాన్ని చేపడుతూ పర్యావరణ పరిరక్షణకు సైతం తనవంతు కృషి చేస్తున్నాడు.
Go Back to Shorts
Thinles Singhe
Sea Buckthorn
Zimpo Ladakh
Himalayan Miracle Berry
Vitamin C Superfood
Ladakh GI Tag

More Telugu News