బీజేపీ జిరాక్స్.. ఆ ఎమ్మెల్యేల కోసం సీఎం విజయ్ 'షాపింగ్' చేస్తున్నారు: స్టాలిన్ ఎద్దేవా

MK Stalin mocks CM Vijay calling TVK a BJP Xerox and shopping for MLAs
  • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బీజేపీకి జిరాక్స్ కాపీ అని ఎద్దేవా
  • అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం
  • టీవీకే కార్యకర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్న స్టాలిన్
  • ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టీకరణ
తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయ్ తీరుపై డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీవీకే సర్కార్ బీజేపీకి 'జిరాక్స్ కాపీ'లా మారిందని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

శనివారం చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్ ప్రసంగించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వ్యూహాలనే తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి విజయ్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కోసం 'షాపింగ్' చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి 21 రోజులు కూడా గడవకముందే, వేలికి ఉన్న సిరా గుర్తు చెరగకముందే నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారని, వారికి ఎలాంటి ఆఫర్ ఇచ్చి చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మహిళల భద్రత అంశాన్ని ప్రస్తావిస్తూ, శ్రీవైకుంఠంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల ఘటనను స్టాలిన్ ఉదహరించారు. ఈ కేసులో బాధితురాలు టీవీకే సభ్యురాలైతే, నిందితులు కూడా అధికార పార్టీకి చెందిన వారని ఆయన ఆరోపించారు. అయితే, నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితురాలినే పార్టీ నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీవీకే కార్యకర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.

గతంలో టీవీకే ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని స్టాలిన్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని భావించినప్పటికీ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తనను మౌనంగా ఉండనివ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడం తమ ఉద్దేశం కాదని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా డీఎంకే తన పాత్రను పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మహిళా కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Go Back to Shorts
MK Stalin
CM Vijay
TVK Government
AIADMK MLAs
Tamil Nadu Politics
BJP Xerox Copy

More Telugu News