ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూపల్లి.. మినీ స్టేడియం కోసం సొంత భూమి విరాళం!

  • గతంలో వీపనగండ్ల వెళ్లినప్పుడు మినీ స్టేడియం కావాలని జూపల్లిని అడిగిన స్థానిక యువత
  • తన సొంత భూమి ఇస్తానని నాడు మాట ఇచ్చిన జూపల్లి
  • రూ. 1.50 కోట్లకు పైగా విలువున్న భూమిని విరాళంగా ఇచ్చిన మంత్రి

రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే నేతలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో తాను ఒకడినని నిరూపించుకున్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. యువత, క్రీడాకారుల భవిష్యత్తు కోసం ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. మినీ స్టేడియం నిర్మాణం కోసం తన సొంత భూమిని కేటాయిస్తూ బుధవారం అధికారికంగా డిజిటల్ సంతకాలు చేశారు.


గతంలో వీపనగండ్ల మండల పర్యటనకు వెళ్లిన సమయంలో.. అక్కడ స్థానిక యువత, క్రీడాకారులు తమకు ఒక మినీ స్టేడియం కావాలని మంత్రి జూపల్లిని అభ్యర్థించారు. వారి కోరికపై సానుకూలంగా స్పందించిన మంత్రి, స్టేడియం నిర్మాణం కోసం తన సొంత భూమిని ఇస్తానని నాడు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ.. వీపనగండ్ల మండల కేంద్రంలోని సర్వే నెం. 532/ఆ లో తన పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని క్రీడాకారుల అభివృద్ధి కోసం అందజేశారు.


నాగర్‌కర్నూల్ జిల్లా కోడేర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఈ భూ బదిలీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తయింది. వీపనగండ్ల మండల తహశీల్దార్ లాగిన్ ద్వారా నిర్వహించిన ఈ ఆన్‌లైన్ ప్రక్రియలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా డిజిటల్ సంతకం చేసి భూమిని ప్రభుత్వానికి బదిలీ చేశారు. మంత్రి కేటాయించిన ఈ నాలుగు ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.1.50 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ చారిత్రాత్మక భూ బదిలీ ప్రక్రియకు సాక్షులుగా కాంగ్రెస్ నాయకుడు మునిగొండ గోపి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ డిజిటల్ సంతకాలు చేశారు.


మంత్రి తీసుకున్న ఈ ఉదార నిర్ణయంపై వీపనగండ్ల మండల ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మినీ స్టేడియం అందుబాటులోకి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని అద్భుతమైన ప్రతిభ గల యువకులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు ఒక గొప్ప వేదిక లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Jupally Krishna Rao
Veepangandla Mini Stadium
Nagarkurnool News
Minister Land Donation
Telangana Sports Infrastructure
Rural Youth Development

More Telugu News