భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన, చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న గిల్, ఈ ఘనత సాధించిన కెప్టెన్ల బ్యాటింగ్ సగటులో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఈ అద్భుత ఫీట్‌ను అందుకున్నాడు.

న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు, గిల్ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. 177 బంతుల్లో 126 పరుగులు చేసిన గిల్, కెప్టెన్‌గా తన ఆరో టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే అతను కెప్టెన్‌గా వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.

ఈ ఘనతతో కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు (99.94) కలిగి ఉన్నారు. బ్రాడ్‌మన్, గిల్ తర్వాత మూడో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర సగటు 69.6 కావడం గమనార్హం. అంటే.. మరే కెప్టెన్ కూడా 70 సగటును దాటలేకపోగా, గిల్ 82కి పైగా సగటుతో చరిత్ర సృష్టించాడు.

భారత కెప్టెన్లలోనూ గిల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. భారత జట్టు తరఫున అత్యంత వేగంగా వెయ్యి టెస్ట్ పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (14 ఇన్నింగ్స్‌లు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, గిల్ సెంచరీతో భారత్ 564 పరుగుల భారీ స్కోరు వద్ద 8 వికెట్లకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘ‌నిస్థాన్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ కంటే ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉంది.