ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..?

Grey Marriages are a new global trend and here is what they are
  • అరవై ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకోవడమే దీని ఉద్దేశం
  • వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని దూరం చేసి, తోడు కోసమే ఈ నిర్ణయాలు
  • ఈ వివాహాల్లో కుటుంబ, ఆర్థికపరమైన సవాళ్లు 
  • ఆస్తి సమస్యల కారణంగా కొందరు పెళ్లికి బదులుగా సహజీవనాన్ని ఎంచుకుంటున్న వైనం
ఒకప్పుడు పెళ్లిళ్లంటే పాతికేళ్లకే అనేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టే వారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఈ కొత్త పోకడను 'గ్రే మ్యారేజెస్' (Grey Marriages) అని పిలుస్తున్నారు. జుట్టు నెరిసిన తర్వాత పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి 'గ్రే మేరేజెస్' అంటున్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహ కారణంగా పెరుగుతున్న ఆయుర్దాయం, మారుతున్న సామాజిక దృక్పథాలు ఈ మార్పుకు కారణమవుతున్నాయి.

50, 60 ఏళ్లు దాటిన వారు, పెద్ద వయసులో జీవిత భాగస్వాములను కోల్పోయిన వారు ఒంటరి జీవితానికి స్వస్తి పలికి, పెళ్లి చేసుకోవడాన్నే 'గ్రే మ్యారేజెస్' లేదా 'లేట్-లైఫ్ మ్యారేజెస్' అని పిలుస్తున్నారు. ఇది కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాకుండా, మన దేశంలోనూ క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.

తోడు కోసమే ప్రధానంగా..
ఈ తరహా వివాహాలకు ప్రధాన కారణం వృద్ధాప్యంలో ఎదురయ్యే ఒంటరితనం. పిల్లలు చదువులు, ఉద్యోగాల రీత్యా ఎదిగి దూరంగా స్థిరపడిన తర్వాత తల్లిదండ్రుల్లో చాలా మంది జీవిత భాగస్వాములను కోల్పోయి, ఏకాంతంతో బాధపడుతుంటారు. ఈ క్రమంలో జీవిత చరమాంకంలో ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ మద్దతు కోసం ఒక తోడు అవసరమని భావిస్తున్నారు. మానసిక ప్రశాంతత, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి, సంతోషాలను పంచుకోవడానికి సహచరి లేదా సహచరుడు ఉంటే జీవితానికి కొత్త అర్థం వస్తుందని నమ్ముతున్నారు. 

అంతేకాకుండా, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఒకరికొకరు అండగా నిలవడం, రోజువారీ పనుల్లో సహాయం చేసుకోవడం వంటి ఆచరణాత్మక ప్రయోజనాలు కూడా ఈ నిర్ణయానికి దారితీస్తున్నాయి. పెరిగిన ఆయుర్దాయం, మారుతున్న సామాజిక దృక్పథాలు ఈ ధోరణికి మరింత ఊతమిస్తున్నాయి.

సవాళ్లు, చిక్కుముడులు లేకపోలేదు..
అయితే, ఈ ప్రయాణం పూర్తిగా పూలపాన్పు కాదు. ఇందులో అనేక సవాళ్లు, చిక్కుముడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రెండు కుటుంబాలను కలపడం, ఇప్పటికే పెద్దవాళ్లైన పిల్లల అభిప్రాయాలను గౌరవించడం, వారి అంగీకారం పొందడం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. చాలా సందర్భాల్లో పిల్లల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంటుంది.

అంతేకాకుండా, ఆర్థిక, చట్టపరమైన సమస్యలు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి. వారసత్వ హక్కులు, ఆస్తుల పంపకం, పెన్షన్, బీమా, ఆరోగ్య సంరక్షణ హక్కులు, ఎస్టేట్ ప్లానింగ్ వంటి విషయాల్లో స్పష్టత అవసరం. ఈ వివాహాల వల్ల తమ వారసత్వ ఆస్తులకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని పిల్లలు ఆందోళన చెందడం సహజం. ఈ సమస్యలను అధిగమించడానికి చాలా మంది పెళ్లికి ముందే న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇటువంటి చట్టపరమైన చిక్కులను నివారించేందుకే కొందరు వృద్ధులు పెళ్లికి బదులుగా సహజీవనాన్ని ఎంచుకుంటున్నారు.

ఒకప్పుడు అరవై ఏళ్ల వయసులో పెళ్లి అంటే వింతగా, విమర్శనాత్మకంగా చూసే సమాజంలో ఇప్పుడు మార్పు వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వ్యక్తిగత సంతోషం, సంతృప్తి ముఖ్యమనే భావనకు ఆమోదం పెరుగుతోంది. సవాళ్లు ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో ఒంటరితనానికి పరిష్కారంగా, కొత్త జీవితానికి నాందిగా 'గ్రే మ్యారేజెస్' నిలుస్తున్నాయి.
Go Back to Shorts
Grey Marriages
Late life marriage
Senior citizen wedding
Companionship in old age
Elderly marriage benefits
Marriage after sixty

More Telugu News