మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్
- 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు
- రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి
- ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ
- పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాలని వైట్ హౌస్ ఒత్తిడి తెస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను జాతీయ భద్రతలో పెద్దగా అనుభవజ్ఞుడిని కాదు, కానీ నేనీ విషయంలో నిజంగా గొప్ప పని చేశానని భావిస్తున్నాను. నేను 8 యుద్ధాలను ముగించాను, త్వరలో తొమ్మిదోది కూడా కాబోతోంది. బహుశా ఆ తర్వాత మరో యుద్ధం కూడా ముగిసి, ఆ సంఖ్య పదికి చేరవచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యూహంపై యూఎస్ కాంగ్రెస్ అసంతృప్తి
ట్రంప్ ఈ శాంతి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే.. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతును మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఒక పెద్ద బిల్లుకు ప్రతినిధుల సభ (House of Representatives) ఆమోదం తెలిపింది. డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు గ్రెగరీ మీక్స్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణం కోసం బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సాయాన్ని, అలాగే రక్షణ రుణాల ద్వారా మరో 8 బిలియన్ డాలర్లను అందుబాటులో ఉంచనున్నారు. రిపబ్లికన్ నాయకత్వాన్ని బైపాస్ చేస్తూ.. ఒక అరుదైన డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా ఉభయ పక్షాల (డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు) మద్దతుతో ఈ బిల్లు 226-195 ఓట్లతో పాసైంది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉక్రెయిన్ దౌత్య వేగంపై కాంగ్రెస్ సభ్యుల్లో ఉన్న అసంతృప్తికి ఈ ఓటింగే నిదర్శనం. నిరంతర సైనిక సహాయం అందించడం వల్ల కీవ్ (ఉక్రెయిన్) చర్చల వద్ద బలంగా నిలబడుతుందని, అంతేగాని రష్యా నిబంధనలకు లొంగిపోయే పరిస్థితి రాదని బిల్లు మద్దతుదారులు వాదించారు.
రిపబ్లికన్లలో చీలిక - ట్రంప్ శాంతికి పరీక్ష
మెజారిటీ రిపబ్లికన్ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకోకూడదని, ఈ ప్రతిపాదన కేవలం ట్రంప్‌పై పోరాడటానికి ఉపయోగించే ఆయుధం మాత్రమేనని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ బ్రయాన్ మాస్ట్ విమర్శించారు. అయితే, కొందరు రిపబ్లికన్ సభ్యులు మాత్రం పార్టీ లైన్ దాటి బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అమెరికా మంచి వైపు నిలబడుతుందా? లేక చెడు వైపు నిలబడుతుందా? అనేది ఇక్కడ ముఖ్యమని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డాన్ బాకాన్ ప్రశ్నించారు. ఉక్రెయిన్‌కు సైనిక మద్దతును కొనసాగించాలనుకునే వారికి, ట్రంప్ ప్రతిపాదిస్తున్న శాంతి చర్చల ఒప్పందానికి మద్దతు ఇచ్చేవారికి మధ్య రిపబ్లికన్ పార్టీలోనే స్పష్టమైన విభజన కనిపిస్తోంది. రష్యా తమ భూభాగ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబడుతుండగా.. ఉక్రెయిన్ తమ సార్వభౌమత్వానికి భంగం కలగకూడదని అంటోంది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని ట్రంప్ ఎలా ముగిస్తారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.