కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే
- ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్
- కేబినెట్లో సిద్ధరామయ్య తనయుడికి చోటు
- ప్రమాణానికి ముందు డీకేకు ఫోన్ చేసిన సోనియా గాంధీ
- అందరినీ కలుపుకుని పనిచేస్తానని సోనియాకు హామీ ఇచ్చిన డీకే
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, మల్లు భట్టివిక్రమార్క తదితరులు హాజరయ్యారు.
డీకే శివకుమార్ కేబినెట్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్రకు చోటు దక్కింది. పరమేశ్వర ఏకైక ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కొత్త మంత్రివర్గంలో 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని డీకే శివకుమార్ వెల్లడించారు. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని ఆమె సూచించినట్లు తెలిపారు. తన నాయకత్వంపై సోనియా గాంధీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, "సోనియా గాంధీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. మొదటి నుంచి నాపై ఆమెకు చాలా నమ్మకం ఉంది. నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది సోనియానే. అందరినీ కలుపుకుని పనిచేయాలని ఆమె సూచించారు. ఆమె నమ్మకాన్ని నిలబెడతానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని నేను హామీ ఇచ్చాను" అని వివరించారు.