ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన

rain forecast for Andhra Pradesh
  • 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
  • మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు కొనసాగుతున్న ద్రోణి
  • వీటి ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే 24 గంటల్లో ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా ఇవి క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నాయి. గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.


మరోవైపు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.


ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల విస్తరణతో ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి.
Go Back to Shorts
Rain
Andhra Pradesh

More Telugu News