జడ్జీల భద్రతపై పోలీసుల కీలక నిర్ణయం.. అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు
- అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు పటిష్ట భద్రత
- బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష
- 24 గంటల నిఘాతో పాటు క్యూఆర్టీ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రత పెంపు అని వెల్లడి
వెలగపూడిలోని డీఎస్పీ కార్యాలయంలో నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ అధ్యక్షతన ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. 24 గంటల సిబ్బంది మోహరింపు, అత్యాధునిక సీసీటీవీ నిఘా, సందర్శకులపై కఠిన ఆంక్షలు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌ల (QRT) ఏర్పాటు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వీవీఐపీల రాకపోకల సమయంలో రూట్ సెక్యూరిటీ, ట్రాఫిక్ నిర్వహణ, నిఘా సమాచార సేకరణ, భద్రతా తనిఖీలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు.
తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో సుమారు రూ.210 కోట్ల వ్యయంతో ఈ జడ్జీల విల్లాలను నిర్మించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ఈ నివాస సముదాయాన్ని ప్రారంభించారు. శాశ్వత హైకోర్టు అమరావతికి మారుతున్న నేపథ్యంలో, న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు సమగ్ర భద్రత కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు. సమావేశం అనంతరం సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రస్తుత ఏర్పాట్లను పరిశీలించారు. ఇది కేవలం ముందుజాగ్రత్త చర్యేనని, ఎలాంటి నిర్దిష్ట ముప్పు హెచ్చరికలు లేవని అధికారులు స్పష్టం చేశారు.