సీఎం విజయ్‌తో చిదంబరం అత్యవసర భేటీ.. ఎందుకోసం?

Chidambaram meets TN CM Vijay
  • రాజ్యసభ సీటు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరినట్లు సమాచారం
  • షణ్ముగం రాజీనామాతో రాజ్యసభ సీటుకు ఉపఎన్నిక
  • అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం
  • కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు 
  • టీవీకే ఏకపక్షంగా గెలిచే అవకాశం
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ ఉపఎన్నిక వేడి మొదలైంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థన
కొత్తగా అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ఆ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థికి అధికార కూటమి మద్దతు ఇవ్వాలని చిదంబరం సీఎం విజయ్‌ను కోరారని తెలుస్తోంది. హైకమాండ్ సూచన మేరకే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎందుకు ఈ ఉపఎన్నిక?
గతంలో ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న షణ్ముగం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం ఈ సీటును గెలుచుకునే పూర్తి అవకాశం అధికార టీవీకే కూటమికే ఉంది.

సీఎం విజయ్ నిర్ణయం ఏంటి?
తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీకి సొంతంగా 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతు కూడా ఉండటంతో ఆ పార్టీ ఏకపక్షంగా గెలిచే పరిస్థితి ఉంది. అయితే ఈ సీటును కాంగ్రెస్‌కు కేటాయించాలా? లేదా తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దించాలా? అనే అంశంపై సీఎం విజయ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తమ పార్టీ సీనియర్ నాయకులు, కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Chidambaram
CM Vijay
Tamilnadu
Congress
TVK

More Telugu News