మీటింగ్ ల నుంచి జనం వెళ్లిపోకుండా కందకాలు తవ్వారు: చామవరం సభలో చంద్రబాబు
Add ap7am to your home Screen

మీటింగ్ ల నుంచి జనం వెళ్లిపోకుండా కందకాలు తవ్వారు: చామవరం సభలో చంద్రబాబు

Chandrababu Naidu Slams Previous Government at Chamavaram Meeting
  • తుని నియోజకవర్గం చామవరంలో 'పేదల సేవలో' సభ
  • గత ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు
  • నాడు భయానక వాతావరణం ఉండేదని విమర్శలు
  • బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యలు
  • విధ్వంసకర పాలన నుంచి జూన్ 4వ తేదీన ఓటుతో విముక్తి కల్పించారని వెల్లడి
  • అది చరిత్రలో నిలిచిపోయే రోజన్న చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉండేదని, బహిరంగ సభలకు వచ్చిన ప్రజలు మధ్యలో వెళ్లిపోకుండా అడ్డుకోవడానికి ఏకంగా కందకాలు తవ్వి, ఫెన్సింగ్‌లు వేసి నిర్బంధించే దుస్థితి ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. అలాంటి విధ్వంసకర పాలన నుంచి జూన్ 4వ తేదీన ప్రజలు తమ ఓటుతో రాష్ట్రానికి విముక్తి కల్పించారని, ఆ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. 

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో సోమవారం జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు బటన్ నొక్కి పైశాచిక ఆనందం పొందేవారని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ, నేరుగా వారి వద్దకే వెళ్లి సేవలు అందిస్తోందని స్పష్టం చేశారు.

పేదలే తొలి ప్రాధాన్యం - పెంచిన పింఛన్లే నిదర్శనం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పేదల కోసం పనిచేస్తోందని, దానికి పెంచిన పింఛన్లే నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి తొలి నెల నుంచే పింఛన్లను పెంచి అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను ఒకేసారి రూ.1,000 పెంచి రూ.4,000 చేశామని, దివ్యాంగులకు రూ.6,000కు పెంచామని గుర్తు చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్య పింఛన్లను రూ.10,000, రూ.15,000కు పెంచామని వివరించారు. 

2024 జూలై నుంచి ఇప్పటివరకు పింఛన్ల రూపంలో రూ.65,887 కోట్లు అందించామని, ఏడాదికి ఈ ఒక్క పథకం కోసమే దాదాపు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్లు పంపిణీ చేస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదని అన్నారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి

పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన కల అని చంద్రబాబు అన్నారు. కేవలం పింఛన్లే కాకుండా 'తల్లికి వందనం', 'స్త్రీశక్తి', 'అన్నదాత సుఖీభవ' వంటి అనేక పథకాల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 

గడిచిన 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, తద్వారా 23 లక్షల ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ సమీపంలో రూ.80 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ, అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటివి యువతకు ఉపాధి మార్గాలు చూపుతాయని అన్నారు.

విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాఠశాలల్లో పాఠ్యాంశాలు మారుస్తున్నామని, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఖరీదైన వైద్యం కోసం ప్రజలు అప్పులపాలు కాకుండా 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' తీసుకువస్తున్నామని ప్రకటించారు. 

'సంజీవని' పేరుతో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించి, ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు. డాక్టర్ అపాయింట్‌మెంట్లు, ఆరోగ్య సందేహాల నివృత్తి కోసం 'ఏఐ డాక్టర్' సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని వివరించారు. రాష్ట్రాన్ని 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌'గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

ప్రాంతీయ అభివృద్ధి.. పోలవరం పూర్తి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి వరకు విశాఖ రీజియన్‌గా, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి రీజియన్‌గా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ రీజియన్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

2027లో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని, ఆ లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులను జూలై నాటికి పూర్తి చేసి నీరందిస్తామని చెప్పారు. మత్స్యకారుల కోసం రూ.240 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లను సబ్సిడీపై అందిస్తామని, అమినాబాద్ ఫిషింగ్ హార్బర్ కోసం రూ.80 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

సుపరిపాలనే ధ్యేయం.. కలిసికట్టుగా ముందుకి

ప్రజలకు నాణ్యమైన పౌరసేవలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే 'వాట్సప్ గవర్నెన్స్' ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని చెప్పారు. '2047 స్వర్ణాంధ్ర విజన్'తో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. ఈ యజ్ఞంలో మిత్రుడు పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కాకినాడ జిల్లాలో పౌరసేవలు సంతృప్తికరంగా అందించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
Pensions
Polavaram Project
Welfare Schemes
TDP
AP Elections 2024
Job Creation
Healthcare
Education

More Telugu News