ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా?
- ఒకే సీజన్ ద్వారా రూ.2.50 కోట్లకు పైగా సంపాదన
- రాజస్థాన్ కాంట్రాక్ట్ ద్వారా రూ.1.10 కోట్లు
- 16 మ్యాచ్‌ల ఫీజుగా రూ.1.20 కోట్లు
- ప్రజెంటేషన్ సెర్మనీ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు
- ఆరెంజ్ క్యాప్ నగదుతో పాటు కారు
మ్యాచ్ ఫీజే ఎక్కువ
మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే అతడికి లభించిన అసలు సంపాదన దీనికంటే చాలా ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందిస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. దీనివల్ల కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే ఈ కుర్రాడు ఏకంగా రూ.1.20 కోట్లు సంపాదించడం విశేషం.
అవార్డులతో కాసుల వర్షం
రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో వైభవ్ అవార్డులను ఊడ్చేశాడు. ఈ సీజన్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకొని భారీగా నగదు బహుమతులను అందుకున్నాడు. ఆ వివరాలు చూస్తే:
- మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.15 లక్షలు
- ఆరెంజ్ క్యాప్ (టాప్ స్కోరర్ - 776 పరుగులు): రూ.10 లక్షలు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు (దీనితో పాటు టాటా సియెర్రా కార్)
- సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు): రూ.10 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు
మ్యాచ్ డే ప్రైజ్ మనీ అదనం
ఈ అవార్డులతో పాటు ప్రతి మ్యాచ్‌లోనూ వైభవ్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్’ వంటి వ్యక్తిగత అవార్డులను ఈ సీజన్లో అనేకసార్లు గెలుచుకున్నాడు. వీటి ద్వారా ప్రతిసారీ రూ.1 లక్ష చొప్పున అదనపు నగదు బహుమతులను తన ఖాతాలో వేసుకున్నాడు.
మొత్తం సంపాదన
ఇలా వార్షిక కాంట్రాక్ట్ ఫీజు రూ.1.10 కోట్లు, మ్యాచ్ ఫీజు రూ.1.20 కోట్లు, ప్రజెంటేషన్ సెర్మనీలో వచ్చిన రూ.55 లక్షల అవార్డు మనీ, మ్యాచ్ డే ప్రైజ్ మనీ.. అన్నీ కలిపితే వైభవ్ మొత్తం సంపాదన రూ.2.50 కోట్ల మార్కును దాటేసింది. ఇతర సీనియర్లతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ.. 15 ఏళ్ల వయసులో ఇంత మొత్తం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు!