ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై కాసుల వర్షం కురిసింది. ఛాంపియన్‌గా నిలిచినందుకు గాను ఆ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏకంగా రూ. 20 కోట్ల భారీ ప్రైజ్ మనీని అందించింది. ఈ సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన మొత్తం ప్రైజ్ పూల్ రూ. 46 కోట్లు కాగా, అందులో సింహభాగం విజేతకే దక్కింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్సీబీ ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత ఈ అరుదైన రికార్డును అందుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.

ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ. 12.50 కోట్లు దక్కాయి. ఇక ప్లేఆఫ్స్‌కు చేరిన ఇతర జట్లకు కూడా బీసీసీఐ నగదు బహుమతిని ప్రకటించింది. క్వాలిఫయర్ 2లో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ. 7 కోట్లు, ఎలిమినేటర్‌లో ఓటమి పాలై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. 6.50 కోట్లు చొప్పున అందాయి.