ఐపీఎల్ 2026 ఫైనల్ సమరానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే టైటిల్ పోరును ఒక 'మామూలు గేమ్‌'గానే పరిగణిస్తున్నామని, ఎలాంటి ఒత్తిడికి లోనవడం లేదని స్పష్టం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపాడు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి, క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో గెలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ నేపథ్యంలో ఆర్సీబీ విడుదల చేసిన ఓ వీడియోలో పాటిదార్ మాట్లాడాడు. "వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతుండటం, అదీ గతేడాది కప్ గెలిచిన ఇదే మైదానంలో కావడం చాలా సంతోషంగా ఉంది. గతేడాదికి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఫైనల్, పెద్ద వేదిక అని తెలుసు. కానీ నా వరకు ఇదొక సాధారణ మ్యాచ్ మాత్రమే" అని అన్నాడు.

భారీ అంచనాలున్న మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్‌లాగే తీసుకోవడం తనకు అలవాటని పాటిదార్ వివరించాడు. "నేను ఎప్పుడూ వర్తమానంలో ఉండటానికే ప్రయత్నిస్తాను. ఇది ఫైనల్ కదా, ఏం జరగబోతోంది, ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. ఫలితంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను" అని తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జట్టుగా ఆడిన తీరు గర్వంగా ఉందని, ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారని కొనియాడాడు.

కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా కెప్టెన్ మాటలతో ఏకీభవించాడు. "వరుసగా ఫైనల్స్‌కు చేరడం గొప్ప విషయం. ఇక్కడికి చేరుకోవడానికి కుర్రాళ్లు చాలా కష్టపడ్డారు. ఈ లీగ్‌లో టేబుల్ టాపర్‌గా నిలవడానికి ఎంతో ధైర్యం కావాలి. అయితే, ఇంకా చేయాల్సింది మిగిలే ఉంది" అని అన్నాడు. ఒత్తిడి పెరిగినప్పుడు విషయాలను సింపుల్‌గా ఆలోచించడం మంచిదని, ఫైనల్‌లో ఆటగాళ్లు అదే వ్యూహంతో బరిలోకి దిగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.

మ‌రి కొన్ని గంట‌ల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే ఫైనల్‌లో గెలిచి, వరుసగా రెండోసారి టైటిల్ సాధించి, ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.