పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. జట్టు దీర్ఘకాలిక ఫిజియో క్లిఫ్ డీకన్‌ను పీసీబీ ఉన్నఫళంగా తొలగించడంపై పలువురు సీనియర్ ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని వారు బోర్డును కోరుతున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ప్రకటించిన సహాయక సిబ్బంది జాబితా నుంచి డీకన్‌ను పీసీబీ తప్పించింది. ఆయన స్థానంలో ఇఫ్తికార్ అహ్మద్‌ను కొత్త ఫిజియోగా నియమించింది. 2017 నుంచి పాక్ జట్టుతో పనిచేస్తున్న దక్షిణాఫ్రికాకు చెందిన డీకన్‌కు ఆటగాళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బౌలర్ల ఫిట్‌నెస్, గాయాల నిర్వహణలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించేవారు.

జట్టులో తరచూ తలెత్తుతున్న గాయాల సమస్యలపై బోర్డు కొత్త స్పోర్ట్స్ మెడిసిన్ డైరెక్టర్ జావేద్ ముఘల్ అసంతృప్తితో ఉన్నారని, దానికి డీకన్‌ను బాధ్యుడిని చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రెండో టెస్టు తర్వాత డీకన్‌కు వీడ్కోలు పలకగా, ఆ కార్యక్రమంలో ఆయన కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం.

అయితే, బోర్డు వాదనతో ఆటగాళ్లు ఏకీభవించడం లేదు. "డీకన్ పనితీరు అద్భుతంగా ఉండేది. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం చూడటం ఫిజియో బాధ్యత కాదు. అది అకాడమీలో జరుగుతుంది. చిన్న చిన్న గాయాలను ఆయన ఎంతో సమర్థంగా నిర్వహించేవారు" అని ఓ ఆటగాడు చెప్పినట్లు తెలిసింది.

ఇటీవల కాలంలో షాన్ టెయిట్, మోర్నీ మోర్కెల్, గ్యారీ కిర్‌స్టన్ వంటి పలువురు విదేశీ కోచ్‌లు, సిబ్బంది అర్ధాంతరంగా తప్పుకోవడం పాక్ క్రికెట్‌లో అస్థిరతకు అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల భవిష్యత్తులో అనుభవజ్ఞులైన విదేశీయులను ఆకర్షించడం కష్టమవుతుందని మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలోనే హెచ్చరించారు. డీకన్ కూడా ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.