మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

  • మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్
  • కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోందన్న ప్రకాష్ రెడ్డి
  • తమ అనుచరులనే తమపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం

అనంతపురం జిల్లాలో గత ఏడాది జరిగిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. తన సోదరుడి అరెస్ట్‌ పై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


"మా అన్న రాజశేఖర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శిఖండి రాజకీయాలు చేస్తోంది" అంటూ ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అసలు తనకు కేటాయించిన గన్‌మెన్‌ను ఎందుకు తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతేడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి సమీపంలోని రైల్వే పట్టాలపై మృతి చెందగా, అప్పట్లో పోలీసులు దానిని ఆత్మహత్యగా నిర్ధారించారని ఆయన గుర్తుచేశారు. 


కానీ, ఏడాది దాటిన తర్వాత ఇప్పుడు రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి తమ బంధువేనని, గతంలో అతను కేసుల్లో ఇరుక్కున్నప్పుడు తామే కాపాడామని, అలాంటిది ఇప్పుడు తమపైనే హత్య కేసు పెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. తద్వారా తమ అనుచరులను తమపైనే రెచ్చగొట్టి, తనను రాజకీయంగా అంతమొందించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలోని ఇతర అంశాలపై కూడా ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా స్పందించారు. "రాష్ట్రంలో హనీ ట్రాప్ వ్యవహారంపై మేము మాట్లాడకూడదా? పాపంపేట భూకబ్జాలను ప్రశ్నించకూడదా? మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై నిలదీస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి, తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్న అధికారుల పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటున్నామని, తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.


Thopudurthi Prakash Reddy
Thopudurthi Rajashekhar Reddy
Maheshwar Reddy
Anantapur
Andhra Pradesh politics
Illegal arrest
Political conspiracy
YSRCP
Crime news
Honey trap case

More Telugu News