వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టాం: మహానాడులో సీఎం చంద్రబాబు

Chandrababu Says He Revived Andhra Pradesh Economy at Mahanadu
  • గత పాలకులు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గట్టెక్కించింద‌న్న చంద్ర‌బాబు
  • పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామ‌ని హామీ
  • రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.14 వేలు అందిస్తున్నామ‌ని వెల్ల‌డి
  • ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు ఇస్తామ‌న్న సీబీఎన్‌
  • రాజధానిపై వైసీపీకి విజన్ లేదు, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపాటు
మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని, దాని బ్రాండ్‌ను తమ కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించి నిలబెట్టామని ఆయన స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ.. రూ.63 వేల కోట్లను పెన్షన్లకే కేటాయించామని, ఇది ఒక రికార్డు అని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు రూ.7,500 మాత్రమే ఇచ్చి నిర్వీర్యం చేస్తే, తమ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ.14 వేలు అందిస్తోందని గుర్తుచేశారు. ఆక్వా రైతులకు జూన్ 1 నుంచి యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. మత్స్యకారులకు అండగా 200 మెకనైజ్డ్ బోట్లను రూ.240 కోట్ల సబ్సిడీతో అందిస్తున్నామని, దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని వివరించారు.

ఇక సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తూ.. పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ధ్వంసమైన డయాఫ్రామ్ వాల్‌ను వెయ్యి కోట్లతో తిరిగి నిర్మించామని తెలిపారు. హంద్రీనీవా ద్వారా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లామని, వెలిగొండ ఫేజ్-1 కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఆరోగ్య రంగంలో 'సంజీవని' ప్రాజెక్టుతో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని, ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం అమలు చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధానిపై వైసీపీకి ఓ విజన్ లేదని, విషం కక్కడమే తెలుసని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి, ఇప్పుడు ప్రతిపక్షంలో 'మావిగన్' అంటున్నారని, వారిని ఏమనాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
Mahanadu
Andhra Pradesh
AP Politics
TDP
YSRCP
Polavaram Project
Irrigation Projects
Welfare Schemes
Digital Health Records

More Telugu News