గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలకు పోవద్దు.. అభివృద్ధి మంత్రం మనది: నేతలకు చంద్రబాబు హితవు

Chandrababu Never Again to Axe Party Development Mantra is Ours
  • గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
  • గొడ్డలి పార్టీకి, టీడీపీకి పోలికే లేదన్న పార్టీ అధినేత‌
  • వారిది విధ్వంసమైతే మనది అభివృద్ధి అని వ్యాఖ్య
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని వెల్ల‌డి
  • విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ
  • స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • ఆరోగ్యకర, సంపన్న, సంతోష ఏపీ నిర్మాణమే కూటమి లక్ష్యమన్న సీఎం
తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారిది విధ్వంసకర పాలన అయితే, తమది అభివృద్ధి మంత్రమని స్పష్టం చేశారు. పేదలకు కావాల్సింది సంక్షేమమే తప్ప గొడ్డలివేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి కానీ గొడ్డలిపోట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. "వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారడం వారి విధానం. ఐటీ నుంచి క్వాంటం వైపు ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్" అంటూ టీడీపీ, వైసీపీల మధ్య ఉన్న తేడాను వివరించారు. గొడ్డలి పార్టీ చేసే కుయుక్తులకు భయపడబోమని, ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీని అడ్డుకోలేరని హెచ్చరించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలు.. ప్రస్తుత ప్రభుత్వ చర్యలు
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. "విశాఖలో రైల్వే జోన్ కోసం కనీసం 52 ఎకరాల భూమిని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం వారిది. కూటమి అధికారంలోకి వచ్చాకే రైల్వే జోన్‌ను సాధించుకున్నాం" అని తెలిపారు. గత పాలకులు రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, డిస్కమ్‌లను రూ.1.35 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మాటిచ్చామని, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నామని, తొలిసారిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గుంతలు పడ్డ రోడ్లను బాగుచేయడంతో పాటు, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని వివరించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు.. 
భూ వివాదాలకు కారణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని, రికార్డులు ట్యాంపర్ కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. నాలా యాక్టును కూడా రద్దు చేసి, ఇప్పుడు రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన కొరత, ఆక్వా రంగ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు.

కేడర్‌కు భరోసా.. భవిష్యత్ కార్యాచరణ
దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ టీడీపీకి ఉందని, పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం లాంటిదని, ఇక్కడ శిక్షణ పొందిన వారే అన్నిచోట్లా రాణిస్తున్నారని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశామని, "మై హెల్త్ యాప్" ద్వారా వారి ఆరోగ్య బాధ్యతను కూడా పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, నేతలు ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు. "ఆరోగ్యకర, సంపన్న, సంతోష ఏపీ" (హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ) నిర్మాణమే తమ లక్ష్యమని, మహానాడు సాక్షిగా తెలుగు జాతి కోసం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల విజయాన్ని మళ్లీ పునరావృతం చేసేలా అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
Go Back to Shorts
Chandrababu
TDP Mahanadu
Telugu Desam Party
AP Politics
Andhra Pradesh
YS Jagan
Land Titling Act
Local Body Elections
AP Development
Coalition Government

More Telugu News