నా తండ్రి, సోదరుడి హత్యల వెనుక పయ్యావుల హస్తం ఉంది: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

Payyavula Behind My Father Brothers Murders Says ExMLA Visveswara Reddy
  • ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది పయ్యావులే అన్న విశ్వేశ్వర్ రెడ్డి
  • దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర పయ్యావుల కుటుంబానిదని వ్యాఖ్య
  • జగన్‌ను విమర్శించే అర్హత పయ్యావులకు లేదని మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన రాజకీయ హత్యలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ముదురుతున్నాయి. ఈ తరుణంలో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌పై వైసీపీ సీనియర్ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉరవకొండ నియోజకవర్గంలో అసలైన హత్యా రాజకీయాలు చేసింది మంత్రి పయ్యావుల కేశవేనని... తన తండ్రి, సోదరుడి దారుణ హత్యల వెనుక పయ్యావుల కుటుంబ హస్తం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న పయ్యావుల కేశవ్, ముందుగా తన సొంత కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు.


పయ్యావుల కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ విశ్వేశ్వర రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గతంలో దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించి వ్యాపారాలు చేసిన చరిత్ర కేశవ్ కుటుంబానిదే. నాడు పయ్యావుల కేశవ్ తాత, తండ్రి చేసిన దుర్మార్గాలపై కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశాయి. వారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినందుకే.. నా తండ్రి రాకెట్ల నారాయణ రెడ్డి, నా సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలను దారుణంగా హత్య చేయించారు" అని ఆరోపించారు. ఇలాంటి నేర చరిత్ర పెట్టుకుని జగన్‌ను విమర్శించే అర్హత పయ్యావులకు ఎంతమాత్రం లేదని మండిపడ్డారు.


ఫ్యాక్షనిజానికి జగన్‌ ఎప్పుడూ వ్యతిరేకమని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులు, దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వైఎస్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఉరవకొండ ప్రజలకు పయ్యావుల కుటుంబం చేసిన అరాచకాలు అన్నీ తెలుసని విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
Payyavula Keshav
Visveswara Reddy
Uravakonda
Andhra Pradesh politics
political assassinations
TDP
YCP
factionalism
Raketla Narayana Reddy
Ravindranath Reddy

More Telugu News