మహానాడు వేదికగా 12 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నా: నారా లోకేశ్
- మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు వేడుకలు
- ఈరోజు, రేపు కొనసాగనున్న మహానాడు
- మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్న నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ పండుగ 'మహానాడు' వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకలను ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ప్రారంభించారు. ఉదయం 10:10 గంటలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో ఈ కార్యక్రమాలు అధికారికంగా మొదలయ్యాయి.
అయితే, ఈ ఏడాది మహానాడులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధానాంశం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ఇవ్వబోతున్న తొలి ప్రసంగం. మధ్యాహ్నం 12 గంటలకు లోకేశ్ మహానాడు వేదికగా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన తొలి మహానాడు ప్రసంగం సందర్భంగా ఒక 'భారీ ప్రకటన' ఉండబోతోందంటూ లోకేశ్ పోస్ట్ చేశారు.
ఈ 'భారీ ప్రకటన' దేనికి సంబంధించింది అయి ఉంటుంది? పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేలా సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తారా? లేక యువత, పరిశ్రమలు, ఉపాధికి సంబంధించిన మరేదైనా కీలక పాలసీని పంచుకుంటారా? అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల్లో, పార్టీ శ్రేణుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ రెండు రోజుల పాటు జరిగే మహానాడు వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.