ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘పుష్ప 2’తో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఆయన, తాజాగా తన చేతికి పెట్టుకున్న వాచ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్, హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన్ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, అందరి దృష్టి బన్నీ చేతికి ఉన్న లగ్జరీ వాచ్‌పై పడింది.

అల్లు అర్జున్ ధరించిన ఈ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత ‘పాటెక్ ఫిలిప్ నాటిలస్’ బ్రాండ్‌కు చెందినది. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైన ఈ వాచ్ (మోడల్: 5712/1R-001) ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. సన్‌బర్స్ట్ బ్రౌన్ డయల్, మూన్ ఫేజ్, పవర్ రిజర్వ్ ఇండికేటర్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది. దీని అందం, ఫీచర్ల మాట అటుంచితే, ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ అధికారిక రిటైల్ ధర సుమారు రూ. 90 లక్షలు. అయితే, మార్కెట్‌లో దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రస్తుత మార్కెట్ ధర దాదాపు రూ. 1.82 కోట్లకు పైగా పలుకుతోంది. ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్.. తన రిచ్ టేస్ట్‌కు, రాయల్ లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగానే ఈ ఖరీదైన వాచ్‌ను ఎంచుకున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు.