ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్

Chandrababu Naidu Vision Plan for AP Coastal Development
  • ఏపీ తీరప్రాంత అభివృద్ధికి విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
  • కోస్తా తీరాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సూచన
  • తీరప్రాంత కోతను అరికట్టేందుకు సహజ రక్షణ కవచం ఏర్పాటు
  • ఆక్వాకల్చర్‌లో వాల్యూ అడిషన్‌, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని నిర్దేశం
  • బ్లూ ఎకానమీ, రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగంపై అధ్యయనం చేయాలని స్పష్టం
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చేందుకు ఒక 'విజన్ ప్లాన్' సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సముద్ర సంపదను అందిపుచ్చుకుంటూనే, తీర ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సముద్రతీర అభివృద్ధిపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 'బ్లూ ఎకానమీ' లేదా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చ జరుగుతోందని, సముద్ర గర్భంలోని అపారమైన వనరులను వెలికితీయడం ద్వారా విస్తృత ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఆక్వాకల్చర్‌ను గణనీయంగా అభివృద్ధి చేశామని, రొయ్యలు, చేపల సాగు, ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. 

అయితే, కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా ఆక్వా ఉత్పత్తుల్లో వాల్యూ అడిషన్ (విలువ జోడింపు) జరగాలని, తద్వారా రైతులకు, రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుందని నిర్దేశించారు. అదే సమయంలో ఆక్వా వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని, ఈ సవాళ్లను అధిగమించేందుకు పూర్తిస్థాయి అధ్యయనం జరగాలని సూచించారు.

తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మెరైన్ బయోడైవర్సిటీని (సముద్ర జీవ వైవిధ్యం) కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం స్పష్టం చేశారు. సముద్రాలతో పాటు తీరప్రాంతాల్లో లభించే రేర్ ఎర్త్ మినరల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆ వనరులను అందిపుచ్చుకోవాలని అన్నారు. తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరప్రాంతాన్ని రక్షించుకోవడం అత్యంత ముఖ్యమని, దీనికోసం మడ అడవులు, తాటి చెట్ల పెంపకం వంటి మూడంచెల సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

తీరప్రాంతాలను పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రాలుగా, ఆర్థిక కార్యకలాపాలకు చిరునామాగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సీ వీడ్ (సముద్రపు పాచి) సాగు, దాని మార్కెటింగ్ అవకాశాలను కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తి స్థాయి అధ్యయనం నిర్వహించి, పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు రావాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ నాయక్, రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, మెరైన్ డైవర్సిటీ సంస్థ వోయసీ ప్రతినిధి ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP Coast
Coastal Development
Blue Economy
Aquaculture
Marine Biodiversity
Rare Earth Minerals
Tourism
Fisheries

More Telugu News