జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు

Chandrababu Naidu Secures Deals with Meta Amazon for AP MSME Growth
  • ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చేందుకు మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన
  • రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్, రూ.300 కోట్లతో సీఎం ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్
  • రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటు లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
  • సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ విధానంతో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్న ప్రభుత్వం
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మెటా, అమెజాన్, జోహో వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజ సంస్థలతో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఎంఈడీసీ) ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులకు ప్రపంచ విపణిలో మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

విజయవాడలో సోమవారం నిర్వహించిన "ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026"లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ నినాదం. 'విలేజ్ టు గ్లోబల్ మార్కెట్' అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మెటా, అమెజాన్ వంటి సంస్థలతో కుదిరిన ఒప్పందాలు ఈ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేస్తాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాం" అని తెలిపారు. జెన్-జీ, జెన్-ఆల్ఫా తరం యువత కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని ఆయన ఉద్ఘాటించారు.

కొత్త కార్యక్రమాలు, పార్కులకు శ్రీకారం
ఈ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే పలు కీలక కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. రూ.200 కోట్ల వ్యయంతో "ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్"ను, రూ.300 కోట్లతో "ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్" (APCMEP)ను ప్రారంభించారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 

"ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. ఇప్పటికే 100 పార్కుల పనులు మొదలయ్యాయి. ఇవాళ మరో 38 పార్కులకు శంకుస్థాపన చేశాం. జూలై నాటికి మిగిలిన వాటిని కూడా పూర్తి చేసి, అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని చంద్రబాబు అన్నారు. 'సైనింగ్-గ్రౌండింగ్-ఓపెనింగ్' తమ ప్రభుత్వ విధానమని, ఒప్పందాలు చేసుకోవడమే కాదు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి, పరిశ్రమలను ప్రారంభించే వరకు నిరంతరాయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

ఎంఎస్ఎంఈలకు అండగా ప్రభుత్వం
వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈ అని, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. "భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ఠ తెస్తే, ఎంఎస్ఎంఈలు లక్షలాది మందికి జీవనోపాధినిస్తాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.558 కోట్ల ప్రోత్సాహకాలను ఇప్పటికే అందించాం. ఏపీఐఐసీలో పరిశ్రమలు స్థాపించే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. త్వరలో 5 లక్షల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం" అని ప్రకటించారు.

100 యూనికార్న్ కంపెనీలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన ఆశయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. "ఏపీ నుంచి 100 యూనికార్న్ కంపెనీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. ప్రధాని మోదీ ఇచ్చిన 'చిప్ టు షిప్' నినాదాన్ని నిజం చేసేలా తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాం. విశాఖ, అమరావతి, తిరుపతిలను ఆర్థిక జోన్లుగా అభివృద్ధి చేస్తూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం," అని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, డీప్ టెక్ స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు సిడ్బీ (SIDBI)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందు, విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను సీఎం ప్రారంభించారు. ఈ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు రూపొందించిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
MSME
Meta
Amazon
Job Opportunities
AP CM Entrepreneur Program
MSME Growth Summit 2026
Village to Global Market
AP Industrial Development

More Telugu News