గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి
- గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో పవన్ సమీక్ష
- రూ. 8,600 కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడంపై అసహనం
- వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రికి వివరించాలని ఆదేశం
రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధత సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటివరకు సరైన సన్నద్ధత కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.8,600 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాగితాలపై ప్రణాళికలు కాకుండా క్షేత్ర స్థాయిలో పనులు కనిపించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎం చంద్రబాబుకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
సరైన ప్రణాళిక లేకుండా ఒకే ఏడాదిలో 7 వేల పనులు హడావుడిగా చేస్తే నాణ్యత దెబ్బతింటుందని పవన్ హెచ్చరించారు. "పాడైపోయిన సిమెంట్‌తో పనులు చేసి ప్రమాదాలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది, స్పష్టమైన డేటా లేకుండా అడిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు" అని స్పష్టం చేశారు.
గత పుష్కరాల తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకుండా, ఆరు జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు ఏర్పాట్లు విస్తరించాలని, గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని త్వరలోనే కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పుష్కరాల నిధుల సమీకరణలో పవన్ కల్యాణ్ ఆశాకిరణంలా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.