మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా?

Why do women cry when angry
  • కోపంలో ఏడవడం బలహీనత కాదు
  • ఇది నరాల వ్యవస్థను కాపాడే ప్రక్రియ
  • హార్మోన్ల మార్పుల వల్ల ఎమోషనల్ ఓవర్‌లోడ్
  • భావోద్వేగాలను దాచడం కంటే ఏడవడం మేలు
  • సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం
మహిళలు కోపంలో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు వారి కళ్లలో నీళ్లు తిరగడం చాలా సహజం. అయితే ఇలా ఏడ్చిన ప్రతిసారీ ‘పీఎంఎస్’ (ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌) లేదా హార్మోన్ల మార్పుల వల్ల అంటూ కొందరు కొట్టిపారేస్తుంటారు. కానీ కోపంలో ఏడవడం బలహీనత కాదని, అది నరాల వ్యవస్థపై పడే తీవ్రమైన ముప్పును అడ్డుకునే ఒక రక్షణ కవచమని మానసిక నిపుణులు వివరిస్తున్నారు.

బ్రెయిన్ రీసెట్
కోపంలో ఏడవడం అనేది మెదడుపై పడిన భావోద్వేగాల భారాన్ని తగ్గించుకునే ఒక ప్రక్రియ. కోపం తీవ్రస్థాయికి చేరినప్పుడు ముఖ్యంగా తమ మాటను ఎవరూ వినడం లేదనే బాధ లేదా నిరాశ కలిగినప్పుడు మెదడు అన్ని ఎమోషన్లను ఒకేసారి నియంత్రించలేదు. ఆ సమయంలో వచ్చే కన్నీళ్లు నరాల వ్యవస్థను తిరిగి ప్రశాంత స్థితికి తీసుకురావడానికి సహాయపడతాయి.

హార్మోన్ల పాత్ర
మహిళల్లో ఈ కన్నీళ్లకు హార్మోన్లు, ఒత్తిడి ప్రతిస్పందన విధానాలు, మెదడులోని భావోద్వేగ ప్రక్రియల కలయికే కారణమని నిపుణులు చెబుతున్నారు. నెలసరి చక్రంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు వేగంగా మారడం వల్ల మూడ్ స్వింగ్స్, కోపం, చిరాకు ఏడుపు రావడం సహజం. ఓవర్ బ్లీడింగ్ లేదా పీరియడ్స్ ముందు వచ్చే ఈ మార్పుల వల్ల సెరటోనిన్ లాంటి న్యూరోట్రాన్స్‌మిటర్లపై ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.

సామాజిక అలవాట్లు, ఒత్తిడి
మహిళలు తమ బాధను లేదా కోపాన్ని కన్నీళ్ల ద్వారా వ్యక్తపర్చడానికి చిన్నప్పటి నుంచి సమాజం అలవాటు చేసిన పద్ధతులు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళలు తమ కోపాన్ని లేదా నిరాశను లోపల అణచిపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ భారం ఎక్కువై కన్నీళ్లుగా మారుతుంది. నిద్రలేమి, తీవ్రమైన మానసిక అలసట, ఆందోళన ఉన్నప్పుడు ఈ ఎమోషనల్ బ్రేక్‌డౌన్ మరింత వేగంగా జరుగుతుంది.

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
కోపంలో అప్పుడప్పుడు ఏడవడం ఆరోగ్యకరమైన రక్షణ చర్యే అయినప్పటికీ ఇది తరచూ జరుగుతుంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పీరియడ్స్ ముందు తీవ్రమైన డిప్రెషన్, విపరీతమైన కోపం, ఆందోళన కనిపిస్తే అది పీఎండీడీ లేదా థైరాయిడ్ లోపాలు, హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చు. అలాంటి సమయాల్లో వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Women
Women crying
crying
hormones
PMS
PMDD
emotional stress
mental health
periods
estrogen

More Telugu News