ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు

Kesineni Srinivas Wife Gets ED Notice in AP Liquor Scam
  • రాజ్ కేసిరెడ్డితో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం
  • 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ సమన్లు
  • గతంలో కూడా జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసిన ఈడీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భార్య కేశినేని జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజా సమన్లలో పేర్కొన్నారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో జానకి లక్ష్మికి ఉన్న వ్యాపార సంబంధాలు, అలాగే 'ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్' కంపెనీతో సాగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో ఆమెకు కూడా వాటా ఉందనే బలమైన అనుమానంతోనే ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ వ్యవహారానికి సంబంధించి జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.


తాజాగా, మరోసారి నోటీసులు ఇవ్వడం అటు రాజకీయంగా, ఇటు ఐటీ-కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ నెట్‌వర్క్, నిధుల మళ్లింపు ఎక్కడెక్కడ జరిగాయనే కోణంలో ఈడీ అధికారులు ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈనెల 27న జరిగే విచారణలో ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ఈ కేసులో మరికొంత మంది కీలక నేతలు, వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. అధికార పార్టీ ఎంపీ కుటుంబానికి ఈడీ సమన్లు జారీ కావడంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


Go Back to Shorts
Kesineni Srinivas
AP Liquor Scam
Andhra Pradesh
ED
Enforcement Directorate
Kesineni Janaki Lakshmi
TDP
YSRCP
Raj Kesireddy
Pride Infracon

More Telugu News