ఏఐ సాయంతో వైద్యం.. 'సంజీవని' సేవలను ప్రత్యక్షంగా వీక్షించిన చంద్రబాబు

Chandrababu Naidu observes AI assisted healthcare services
  • చిత్తూరు జిల్లా యాదమరిలోని ‘సంజీవని’ పీహెచ్‌సీని సందర్శించిన సీఎం చంద్రబాబు
  • రోగి నమోదు నుంచి మందుల పంపిణీ వరకు డిజిటల్ ప్రక్రియను పరిశీలన
  • ఏఐ ఆధారిత వైద్యం, వర్చువల్ కన్సల్టేషన్ విధానాలను ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం
  • సాంకేతికతతో వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం తగ్గి రోగులపై శ్రద్ధ పెరిగిందని వెల్లడి
  • కుప్పం, బెంగళూరు నిపుణులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహణ
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో వైద్య సేవలు అందించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. యాదమరి మండలంలోని 'సంజీవని' ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆయన సందర్శించి, అక్కడ అందుతున్న డిజిటల్ వైద్య సేవల పనితీరును స్వయంగా సమీక్షించారు. టెక్నాలజీని అనుసంధానించి సామాన్యులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారనే అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా, ఒక రోగి పీహెచ్‌సీకి వచ్చినప్పటి నుంచి వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకుని వెళ్లేంత వరకు జరిగే పూర్తి ప్రక్రియను సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా వీక్షించారు. ముందుగా, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ) డెస్క్ వద్ద డిజిటల్ పద్ధతిలో రోగి వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విజిట్ రికార్డుల జనరేషన్, రోగుల సేవల మ్యాపింగ్ వంటి అంశాలను అక్కడి సిబ్బంది సీఎంకు వివరించారు. అనంతరం పీహెచ్‌సీ డ్యాష్‌బోర్డును పరిశీలించి, రోజువారీగా నమోదవుతున్న మొత్తం రిజిస్ట్రేషన్లు, కన్సల్టేషన్ల వివరాలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ట్రాక్ చేస్తున్న విధానంపై అధికారులతో చర్చించారు.

ఆ తర్వాత స్టాఫ్ నర్స్ స్టేషన్‌కు వెళ్లి, రోగుల బీపీ, ఎత్తు, బరువు, శరీర ఉష్ణోగ్రత, హార్ట్ బీట్, పల్స్ రేట్ వంటి కీలక వివరాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఇక్కడి నుంచి అత్యంత కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని వీక్షించారు. మెడికల్ ఆఫీసర్ ఒక రోగి పాత ఆరోగ్య చరిత్రను సేకరించడం, నర్సులు నమోదు చేసిన వివరాలను తనిఖీ చేయడం, ఏఐ సపోర్ట్‌తో వ్యాధి నిర్ధారణకు సహకారం తీసుకోవడం వంటివి లైవ్‌లో ప్రదర్శించారు. 

ఈ టెక్నాలజీ వల్ల డాక్యుమెంటేషన్ భారం గణనీయంగా తగ్గి, రోగులపై ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలవుతుందని వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆటోమేటెడ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ జనరేషన్ ప్రక్రియలను కూడా సీఎంకు చూపించారు.

అనంతరం ఫార్మసీ విభాగాన్ని సందర్శించిన చంద్రబాబు, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రోగులకు వేగంగా మందులు పంపిణీ చేస్తున్న విధానాన్ని చూశారు. చివరిగా, పీహెచ్‌సీలోని వర్చువల్ రూమ్‌ నుంచి 'సంజీవని' ప్లాట్‌ఫామ్ ద్వారా కుప్పం ఏరియా ఆసుపత్రి, బెంగళూరులోని టాటాఎండీకి చెందిన నిపుణులైన వైద్యులతో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వైద్య అంతరాలను తగ్గించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది పనితీరును అభినందించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AI in healthcare
Sanjeevani
Chittoor district
digital healthcare
rural healthcare
Tata MD
virtual consultation
healthcare technology

More Telugu News