హర్మూజ్ మూసివేత మరింత కాలం కొనసాగితే చమురు ధరలు భారీగా పెరగొచ్చు!

Hormuz Strait Closure May Cause Huge Oil Price Increase
  • డేటా అనలటిక్స్ సంస్థ ఉడ్ మెకంజీ నివేదిక వెల్లడి
  • గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోయిన 11 మిలియన్ బ్యారెళ్ల మూడి చమురు సరఫరా
  • జూన్ నాటికి పశ్చిమాసియాలో సమస్య తగ్గితే 80 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ ధర
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడటంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశముందని డేటా అనలటిక్స్ సంస్థ ఉడ్ మెకంజీ పేర్కొంది. హర్మూజ్ జలసంధి మూసివేత ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది.

అదే జరిగితే కనుక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చని హెచ్చరించింది. ఇరాన్, అమెరికా యుద్ధం ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన విషయం తెలిసిందే. నాటి నుంచి ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్భణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే 11 మిలియన్ బ్యారెళ్ళ చమురు సరఫరా నిలిచిపోయింది.

సుమారు 80 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది ప్రపంచ ఎల్ఎన్‌జీ సరఫరాలో 20 శాతానికి సమానం. హర్మూజ్ జలసంధి తెరుచుకోవడంపై అంతర్జాతీయ ఆయిల్, గ్యాస్, ధరలు, ఇంధన డిమాండ్లు ఆధారపడి ఉంటాయని ఉడ్ మెకంజీ పేర్కొంది. జూన్ నాటికి సమస్య తగ్గితే 2026 చివరినాటికి బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లకు, వచ్చే ఏడాదికి 65 డాలర్లకు తగ్గుతుందని అంచనా వేసింది.

హర్మూజ్ మూసివేత ఆగస్ట్ వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని మరో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ రాపిడాన్ ఎనర్జీ గ్రూప్ పేర్కొంది. ఆగస్టు లేదా అంతకంటే ఎక్కువ కాలం మూసివేస్తే మార్కెట్లో రోజుకు దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కొరత ఏర్పడుతుందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం భారీగా పడిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. చమురు ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, వృద్ధి మందగించే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
Go Back to Shorts
Hormuz Strait
Crude Oil Prices
Iran
America
Wood Mackenzie
Rapidan Energy Group
Global Economy
Economic Recession
Oil Supply
LNG Supply

More Telugu News