తినడం రాంగ్ టైమ్ లోనే, పడుకోవడం రాంగ్ టైమ్ లోనే... భారతీయుల డైలీ రొటీన్ పై ఓ వైద్యుడి ఆసక్తికర విశ్లేషణ

  • ఆధునిక జీవనశైలితో భారతీయుల ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటోందని నిపుణుల హెచ్చరిక
  • సరైన సమయంలో తినకపోవడం, సరైన సమయంలో నిద్రపోకపోవడం ప్రధాన కారణాలు
  • రాత్రి 9 తర్వాత భోజనం, ప్రాసెస్డ్ ఫుడ్ అత్యంత ప్రమాదకరమని సూచన
  • తగినంత నీరు, ఫైబర్ తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడంతో తీవ్ర సమస్యలు
  • ఆరోగ్యకర జీవనశైలికి వైద్యులు సూచించిన కీలక మార్పులు
"సాధారణ భారతీయులు రాంట్ టైమ్ లో తింటారు, రాంగ్ టైమ్ లో నిద్రపోతారు, నీళ్లు తప్ప మిగతావన్నీ తాగుతారు. అదేమిటని అడిగితే డైలీ రొటీన్ అంటారు" అంటూ బెంగళూరుకు చెందిన ప్రముఖ కోలొరెక్టల్ సర్జన్ డాక్టర్ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, ఆధునిక జీవనశైలి మన ప్రేగుల (Gut) ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివరించారు.

ప్రస్తుత బిజీ జీవితంలో చాలామంది చేసే 6 ప్రధాన తప్పుల వల్ల ప్రేగు సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

డాక్టర్ పేర్కొన్న 6 హానికర అలవాట్లు

1. అర్ధరాత్రి భోజనం: రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణంకాక, పులిసిపోతుంది. దీనివల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. 
2. అస్తవ్యస్త ఆహార వేళలు: ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయకపోవడం, కొన్నిసార్లు భోజనం మానేయడం వల్ల ప్రేగుల పనితీరు దెబ్బతిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి సమస్యలు వస్తాయి. 
3. ప్రాసెస్డ్ ఫుడ్: రోజూ బిస్కెట్లు, చిప్స్, నూడుల్స్ వంటి ప్యాకెట్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. 
4. నీరు తక్కువగా తాగడం: చాలామంది భారతీయులలో మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలకు శరీరంలో నీటిశాతం తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. 
5. ఫైబర్ లేని ఆహారం: మైదా, తెల్ల అన్నం ఎక్కువగా తీసుకుని, పీచుపదార్థాలు (ఫైబర్) ఉన్న కూరగాయలు, పండ్లు తినకపోవడం వల్ల వ్యర్థాలు ప్రేగులలో పేరుకుపోతాయి. 
6. సరిగ్గా నిద్రపోకపోవడం: నిద్రలేమి వల్ల ప్రేగులలో వాపు (inflammation) పెరిగి, అసిడిటీ వంటి సమస్యలు తీవ్రమవుతాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ చిన్న చిన్న మంచి అలవాట్లు అలవర్చుకోవాలని డాక్టర్ పరమేశ్వర సూచించారు. రాత్రి 9 లోపు భోజనం చేయడం, రోజూ తగినంత నీరు తాగడం, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి ప్రేగుల ఆరోగ్యానికి చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు.

*గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.*

Parameshwara CM
Indian diet
daily routine
gut health
processed food
sleep habits
fiber diet
IBS
colorectal surgeon
late night eating

More Telugu News