రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ కీలక నిర్ణయం

  • బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెంచడానికి రూపాయి-డాలర్ బై, సెల్ స్వాప్ విధానం
  • 5 బిలియన్ డాలర్ల బై, సెల్ చేపట్టాలని నిర్ణయం
  • మే  26వ తేదీ నుంచి వేలం ప్రక్రియ
  • బ్యాంకులు ఆర్బీఐకి డాలర్లను విక్రయించి, రూపాయలను పొందడమే బై, సెల్ విధానం
భారత కరెన్సీ రూపాయి రోజురోజుకూ క్షీణిస్తోంది. రూపాయితో డాలర్ మారకం విలువ 96ను దాటి పడిపోయింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లభ్యతను పెంచడానికి 5 బిలియన్ డాలర్ల విలువైన డాలరు - రూపాయి బై, సెల్ స్వాప్ వేలాన్ని చేపట్టనుంది.

మే 26వ తేదీన వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పతనమవుతోంది. దీంతో బై, సెల్ స్వాప్ వేలం నిర్ణయం తీసుకుంది. పరిస్థితులకు అనుగుణంగా మూడేళ్ల కాలపరిమితితో రూపాయి - డాలర్ బై, సెల్ స్వాప్ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది.

మార్కెట్‌లో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బీఐ బై, సెల్ స్వాప్ విధానాన్ని అనుసరిస్తుంటుంది. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను ఆర్బీఐకి విక్రయించి, దానికి సమానమైన రూపాయలను పొందడమే ఈ విధానం. మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత అంతే మొత్తంలో డాలర్లను ముందే నిర్ణయించిన ప్రీమియం ధరతో తిరిగి కొనుగోలు చేయడానికి బ్యాంకులు ఒప్పందం చేసుకుంటాయి. ఈ విధానం ద్వారా బ్యాంకులకు నిధుల లభ్యత పెరుగుతుంది. మరోవైపు ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వలు పెరుగుతాయి. అప్పుడు రూపాయి పతనం ఆగిపోతుంది.

RBI
Reserve Bank of India
Rupee Value
USD to INR
Rupee Dollar Swap
Currency Depreciation

More Telugu News